తొలి మూడు సినిమాలతో ఎదురు దెబ్బలు తిన్న అక్కినేని అఖిల్.. నాలుగో సినిమాతో హిట్టు కొట్టేవాడో లేదో ఐదు నెలల కిందటే తేలిపోవాల్సింది. అతడి కొత్త చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ను మేలోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ చివరి దశలో ఉండగా కరోనా వచ్చి బ్రేక్ వేసింది. ఆరు నెలల పాటు అందరిలానే ఈ చిత్ర బృందం సైతం చిత్రీకరణ ఆపేసి సైలెంటుగా ఉండిపోయింది.
ఐతే ఈ మధ్య కరోనా సోకకుండా నిబంధనలు పాటిస్తూనే చిత్రీకరణలు పున:ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ టీం కూడా అలాగే షరతుల మధ్య చిత్రీకరణ మొదలుపెట్టింది. ఈ సందర్భంగా లొకేషన్ నుంచి అఖిల్, పూజా హెగ్డేల ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. విరామం లేకుండా చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరిపి సినిమాను పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.
కాగా ఈ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేయబోయేది లొకేషన్ నుంచి ఒక వీడియో ద్వారా అఖిల్ వెల్లడించడం విశేషం. సంక్రాంతి అయ్యాక తర్వాతి వారంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ను విడుదల చేస్తారట. జనవరి 21 అంటూ డేట్ కూడా చెప్పేశాడు అఖిల్. గత ఏడాది అఖిల్ మూడో సినిమా ‘మిస్టర్ మజ్ను’ను సైతం సంక్రాంతి తర్వాతి వారంలో రిలీజ్ చేశారు. ఈసారి సంక్రాంతి సినిమాల విషయంలో క్లారిటీ లేదు. ఇప్పటిదాకా ఏ చిత్రమూ సంక్రాంతికి ఖరారవ్వలేదు.
అయినప్పటికీ పండగ పోటీలో నిలవకుండా తర్వాతి వారం తమ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ ఏడాది అలా విడుదలైన ‘డిస్కో రాజా’కు చేదు అనుభవం మిగిలింది. సంక్రాంతి సినిమాల్ని విరగబడి చూసిన జనాలు.. తర్వాత వచ్చిన ఈ చిత్రాన్ని పట్టించుకోలేదు. ఆ అనుభవం తర్వాత కూడా అఖిల్ ఈ డేట్ ఎంచుకున్నాడంటే రిస్క్ చేస్తున్నట్లే.