ఈసారి వదిలేశారు-నవదీప్

బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. సీనియర్ నటులు హేమ, శ్రీకాంత్ లాంటి వాళ్ల పేర్లు ఈ వివాదంలో తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా హేమ విషయం చర్చనీయాంశం అవుతోంది.

పార్టీ జరిగినట్లుగా చెబుతున్న రోజు తాను ఫామ్ హౌస్‌లో ఉన్నట్లు హేమ పేర్కొనగా.. అదే రోజు ఆమె బెంగళూరుకు విమాన ప్రయాణం చేసినట్లు ఆధారాలు బయటికి వచ్చాయి. అంతే కాక హేమ బ్లడ్ శాంపిల్స్‌లో డ్రగ్స్ ఆనవాళ్లు దొరికినట్లు కూడా బెంగళూరు పోలీసులు వెల్లడించారు.

ఈ వ్యవహారం ఇలా ఉండగా.. ఎప్పుడు రేవ్ పార్టీ అన్నా టాలీవుడ్లో ప్రముఖంగా వినిపించే పేరు నవదీప్‌దే. గతంలో నవదీప్ ఫామ్ హౌస్‌లోనే రేవ్ పార్టీ జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఇలా పలుమార్లు నవదీప్ పేరు చర్చనీయాంశం అయింది.

ఐతే ఈసారి మాత్రం నవదీప్ పేరు వినిపించలేదు. ఇదే విషయమై తన కొత్త చిత్రం ‘లవ్ మౌళి’ ప్రమోషన్ల సందర్భంగా మాట్లాడాడు నవదీప్. ఈసారి రేవ్ పార్టీలో తన పేరు వినిపించనందుకు చాలామంది నిరుత్సాహపడినట్లు అనిపిస్తోందని అతను సరదాగా వ్యాఖ్యానించాడు.

ఈసారి ఈ న్యూస్‌లో నీ పేరు లేదేంటి అని సోషల్ మీడియాలో చాలామంది తనను ప్రశ్నించినట్లు నవదీప్ తెలిపాడు. మీడియా వాళ్లు కూడా ఈసారి మీ పేరు బయటికి రాలేదేంటి అని ప్రశ్నిస్తే.. ఈసారికి తనను వదిలేశారని, తనకు మంచే జరిగిందని వ్యాఖ్యానించాడు నవదీప్.

రేవ్ పార్టీ అంటే ఏంటి అంటే.. రేయి, పగలు జరిగేదని ఒక ప్రశ్నకు సమాధానంగా పంచ్ వేశాడు నవదీప్. ఇదిలా ఉండగా.. ‘లవ్ మౌళి’ చిత్రాన్ని జూన్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.