నేరస్థుడి వెనుక ‘సత్యభామ’ వేట

హీరోయిన్ ఓరియెంటెడ్ అందులోనూ యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలు గత కొన్నేళ్లలో ఎవరూ ప్రయత్నించలేదు. అందుకే కాజల్ అగర్వాల్ సత్యభామ ఇప్పుడొచ్చే వాటిలో కొంత ప్రత్యేకంగా కనిపిస్తోంది. గూఢచారి, మేజర్ దర్శకుడు శశికిరణ్ తిక్కా సమర్పకుడిగా ఉండటమే కాక స్క్రీన్ ప్లే బాధ్యతను తీసుకోవడంతో మూవీ లవర్స్ లో అంచనాలు రేగుతున్నాయి. ఇవాళ బాలకృష్ణ ముఖ్య అతిథిగా హైదరాబాద్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో ట్రైలర్ లాంచ్ చేశారు. జూన్ 7 విడుదల కాబోతున్న ఈ పోలీస్ క్రైమ్ థ్రిల్లర్ తాలూకు కథా కమామీషు రెండున్నర నిమిషాల్లో చెప్పే ప్రయత్నం చేశారు.

తప్పు జరిగితే ముందు వెనుక చూడకుండా నేరస్థులను చంపడానికి సైతం వెనుకాడని పోలీస్ ఆఫీసర్ సత్యభామ(కాజల్ అగర్వాల్). ఓ ముస్లిం అమ్మాయిని కిడ్నాప్ నుంచి విడిపించే క్రమంలో చేసిన పొరపాటు వల్ల ఆమె చావుకు కారణమవుతుంది. దీనితో డిపార్ట్ మెంట్ నుంచి సస్పెండ్ అయ్యే పరిస్థితి తలెత్తుతుంది. ప్రేమించినవాడు(నవీన్ చంద్ర), పై అధికారి(ప్రకాష్ రాజ్) అండగా నిలబడతారు. అయితే ప్రాణాలు కోల్పోయిన యువతి కుటుంబంలో అలజడి రేగడమే కాక జాడ తెలియని హంతకుడి నుంచి కొత్త సమస్య మొదలవుతుంది. అదేంటనేది సత్యభామలో చూడాలి.

మాములుగా గ్లామర్ పాత్రల్లో హీరోయిన్ గా అలవాటైన కాజల్ అగర్వాల్ ని పోలీస్ ఆఫీసర్ గెటప్ లో చూడటం వెరైటీగా ఉంది. క్యారెక్టర్ కు తగ్గట్టు ఒదిగినట్టు కనిపిస్తోంది. ప్రొడక్షన్ వేల్యూస్, టెక్నికల్ టీమ్ సపోర్ట్ బలంగానే ఉంది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించగా శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చాడు. శర్వానంద్ మనమేతో పాటు సత్యభామ ఒకే రోజు జూన్ 7 థియేటర్లలో అడుగు పెట్టనుంది. విశ్వక్ సేన్, అడవి శేష్ చేసిన హిట్ సిరీస్ లాగా ఇది కూడా టార్గెట్ పెట్టుకున్న ప్రేక్షకులను మెప్పిస్తే కనక సోలో హిట్టు అందుకున్న సీనియర్ హీరోయిన్ గా కాజల్ అగార్వల్ ఖాతాలో హిట్టు పడొచ్చు.