మీడియం హీరోల డిజిటల్ కష్టాలు

స్టార్ ఇమేజ్ ఎంత ఉన్నా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్న డిజిటల్ మార్కెట్ వాళ్ళకో సవాల్ గా మారిపోయింది. కరోనా టైం నుంచి కాంబినేషన్ మీద క్రేజ్ ఉంటే చాలు భారీ మొత్తాలను కళ్ళు మూసుకుని ఆఫర్ చేసిన ఓటిటి సంస్థలు ఇప్పుడు ఆచితూచి అడుగులు వేయడమే కాక బేరాల విషయంలో కఠినంగా ఉండటంతో నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయి.

బలమైన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఓ హీరో సినిమాను ఒక పెద్ద ఓటిటికి అమ్మడం కోసం సదరు ప్రొడ్యూసర్ తన బ్యానర్ పలుకుబడిని ఉపయోగిస్తే తప్ప మంచి రేట్ రాలేదు. కారణం ఆ హీరో హ్యాట్రిక్ డిజాస్టర్స్ లో ఉండటమే.

ఇంకో హీరోకు గత రెండు సినిమాలు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో నిర్మాణంలో ఉన్న సూపర్ హిట్ సీక్వెల్ పై దాని ప్రభావం పడి కోరుకున్న ధరను ఓటిటిలు ఆఫర్ చేయలేదు. ఆ డబ్బులతో బ్యాలన్స్ షూటింగ్ మేనేజ్ చేద్దామనుకున్న నిర్మాత కం దర్శకుడు ఈ దెబ్బకు నెలల పాటు చిత్రీకరణ ఆపేయాల్సి వచ్చింది. ఆ డైరెక్టర్ ముందు మూవీ ఘోరమైన ఫెయిల్యూర్ కావడం ఇంకో కారణం. దీని వల్ల ట్రేడ్ నుంచి ఆశించిన స్థాయిలో అడ్వాన్సులు అందలేదు. చివరికి ఎదురు చూపులు ఫలించి ఒక మంచి మొత్తమే డిజిటల్ రూపంలో సెటిల్ కావడంతో ఇటీవలే సెట్స్ పైకి తీసుకెళ్లారు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలున్నాయి. గుడ్డిగా ఓటిటిని నమ్ముకుని ప్రొడక్షన్ కాస్ట్ ని ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతే పరిణామాలు ఇలాగే ఉంటాయి. డిజిటల్ హక్కుల వ్యవహారం తేలకపోవడం వల్లే చాలా టయర్ 2 హీరోల సినిమాల విడుదల తేదీలు ప్రకటించలేకపోతున్నారు. ఇలా జరగడం వల్ల పెట్టుబడి మీద వడ్డీల భారం పెరగడంతో పాటు సరైన రిలీజ్ డేట్ దొరక్క ఇంకో రకం అవస్థలు పడాల్సి వస్తోంది. కేవలం కాంబినేషన్ క్రేజ్ తో మీడియం రేంజ్ హీరోల బిజినెస్ జరగడం లేదు. ఇకపై అన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి ఇబ్బందులు ఇకపై కూడా తప్పవు.