ప్రభాస్‌ను వాడుకుని వదిలేయరుగా..

‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించాడు ప్రభాస్. ఇండియాలో ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్లున్నారు కానీ.. ట్రూ పాన్ ఇండియా స్టార్ అంటే ప్రభాస్ పేరే చెప్పాలి. ఓవరాల్‌గా డిజాస్టర్ అనిపించుకున్న అతడి చివరి సినిమా ‘సాహో’ ఉత్తరాదిన రూ.150 కోట్ల వసూళ్లతో హిట్ స్టేటస్ అందుకోవడం విశేషం.

‘బాహుబలి’ తర్వాత అమాంతం పెరిగిన ప్రభాస్ క్రేజ్‌ను వాడుకోవాలని ఎంతోమంది దర్శకులు, నిర్మాతలు చూస్తున్నారు. అందులో బాలీవుడ్ వాళ్లూ తక్కువేమీ కాదు. కరణ్ జోహార్ అంతటివాడు ప్రభాస్‌తో సినిమా కోసం గట్టిగా ట్రై చేశాడు. ఐతే ప్రభాస్ మాత్రం ఓం రౌత్ దర్శకత్వంలో భూషణ్ కుమార్, తదితరులు కలిసి నిర్మించనున్న ‘ఆదిపురుష్’కు ఓకే చెప్పాడు. ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసినప్పటి నుంచి వార్తల్లో నిలుస్తోంది. దీని బడ్జెట్ ఏకంగా రూ.500 కోట్లంటున్నారు. ఇంకా మరెన్నో ఊహాగానాలు వినిపించాయి.

ఐతే ప్రభాస్‌కు ఈ సినిమాతో నిజంగా ప్రయోజనం ఉంటుందా.. లేక అతడి క్రేజ్‌ను వాడుకునేందుకు ఈ సినిమా తీస్తున్నారా అన్న కోణం కూడా ఆలోచించాలి. ఈ సినిమా గురించి వినిపిస్తున్న కొన్ని విశేషాలు అంత ఎగ్జైటింగ్‌గా ఏమీ అనిపించట్లేదు. ఇది రామాయణ కథతో తెరెక్కుతున్న సినిమా అని.. ఇందులో ప్రభాస్‌ది రాముడి పాత్ర అని అన్నారు. ‘మహాభారతం’ అంటే చాలా భారీ కథ, అందులో ఉపకథలు లెక్కలేనన్ని ఉన్నాయి. కానీ రామాయణ గాథ అందరికీ బాగా తెలిసిందే. దీని మీద ఎన్నో సినిమాలు, సీరియళ్లు వచ్చాయి. కథ పరంగా చూస్తే మరీ ఎగ్జైటింగ్ ఏమీ కాదు.

పైగా ఇందులో విలన్‌గా తీసుకున్న సైఫ్ అలీ ఖాన్.. ప్రభాస్‌కు దీటుగా లేడన్న అభిప్రాయం ఉంది. మరోవైపు ఈ సినిమాను ఆరు నెలల్లో పూర్తి చేయాలని, దాదాపు 30 భాషల్లో రిలీజ్ చేయాలని ప్రణాళికలు వేసుకున్నట్లు చెబుతున్నారు. 2022 ఆరంభంలోనే రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నారు. చూస్తుంటే తెలిసిన కథకే సాంకేతిక హంగులు అద్ది.. హడావుడిగా సినిమాను చుట్టేసి సొమ్ము చేసుకుంటారేమో అన్న సందేహాలూ కలుగుతున్నాయి. కేవలం ప్రభాస్ క్రేజ్‌ను వాడుకోవడానికే ఈ సినిమా తీస్తున్నారా అన్న అనుమానమూ రేకెత్తుతోంది. చూడాలి.. ఏమవుతుందో?