రెగ్యులర్ కథల జోలికి వెళ్లకుండా డిఫరెంట్ గా ప్రయత్నిస్తూ కార్తికేయ 2తో పెద్ద బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న యూత్ హీరో నిఖిల్ మంచి స్పీడుమీదున్నాడు. ఒకేసారి రెండు ప్యాన్ ఇండియా మూవీస్ నిర్మాణంలో ఉండగా వాటిలో ఒకదానికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహారించడం విశేషం. స్వయంభు కోసం ఇతను పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. కత్తిసాము, యుద్ధ విద్యలు నేర్చేసుకున్నాడు. తెరమీద ఇప్పటిదాకా చూడని ఒక అరుదయిన ఆవిష్కరణ ఇందులో ఉంటుందిట. చారిత్రక సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ది ఇండియా హౌస్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
ఇవి కాసేపు పక్కనపెడితే మూడేళ్ళ క్రితం దర్శకుడు సుధీర్ వర్మతో నిఖిల్ హీరోగా బివిఎస్ఎన్ ప్రసాద్ ఒక సినిమా మొదలుపెట్టారు. సప్తసాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్,దివ్యంశ కడియా హీరోయిన్లుగా గాయకుడు కార్తీక్ ని సంగీత దర్శకుడిగా సెట్ చేసుకున్నారు. విదేశాల్లో కీలక భాగం షూట్ చేశారట. అయితే కొంత కాలం తర్వాత హఠాత్తుగా దీని గురించిన అప్డేట్స్ ఆగిపోయాయి. తీసినంత వరకు అవుట్ ఫుట్ సంతృప్తికరంగా రానందు వల్లే నిఖిల్ బ్రేక్ వేశాడని, స్పై విషయంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ రిపీట్ కాకూడదనే ఉద్దేశంతో పక్కన పెట్టేశారనే టాక్ బలంగా వినిపిస్తోంది.
భవిష్యత్తులో దీన్ని కొనసాగిస్తారో లేదో క్లారిటీ లేదు. ఓటిటీ మూవీ శాకినీ డాకిని, రవితేజ రావణాసురలు రెండూ డిజాస్టరయ్యాక సుధీర్ వర్మ ఇమేజ్ కి ఇబ్బందొచ్చింది. ఒకవేళ ఏదో ఒకటి బ్లాక్ బస్టరైనా ఆ కథ వేరు. కానీ జరిగింది వేరు. ఒకవేళ నిఖిల్ సానుకూలంగా ఉన్నా పూర్తి చేయడం అంత సులభంగా కనిపించడం లేదు. బివిఎస్ఎన్ ప్రసాద్ సైతం దీని గురించి ఎక్కడా మాట్లాడ్డం లేదు. నిఖిల్ తో సూపర్ హిట్ స్వామి రారా, యావరేజ్ కేశవలు ఇచ్చిన సుధీర్ వర్మ ముచ్చటగా మూడో సినిమా ప్లాన్ చేసుకుంటే అదేమో ఇలా అయ్యింది. చూస్తుంటే వెలుగు చూడటం కష్టమే అనిపిస్తోందట.