మన సందీప్ కిషన్ హీరోగా తమిళంలో మానగరం అనే థ్రిల్లర్ మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్. తెలుగులో నగరం పేరుతో రిలీజైన ఆ చిత్రం ఇక్కడ అంతగా ఆడలేదు కానీ.. తమిళంలో మాత్రం మంచి విజయమే సాధించింది. ఐతే లోకేష్ సత్తా ఏంటో అన్ని భాషల వాళ్లకూ చాటిచెప్పిన చిత్రం అంటే.. ఖైదీనే.
కార్తీ హీరోగా అతను రూపొందించిన ఆ చిత్రం గత ఏడాది సెన్సేషనల్ హిట్టయింది. అందులోని భావోద్వేగాలు, ఉత్కంఠ, సెంటిమెంటుకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సినిమా లోకేష్‌కు విజయ్ లాంటి పెద్ద హీరోతో సినిమా చేసే అవకాశం తెచ్చిపెట్టింది. వీళ్ల కలయికలో తెరకెక్కిన మాస్టర్ విడుదల కోసం ఎదురు చూస్తోంది.
ఈ లోపే లోకేష్‌కు మరో పెద్ద అవకాశం వచ్చింది. అతను లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా సినిమా చేయబోతుండటం విశేషం. ఈ సినిమా గురించి ఓ ప్రి లుక్ ద్వారా అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఒకప్పుడు ఒక దయ్యం ఉండేది అనే క్యాప్షన్‌తో తుపాకులతో కమల్ రూపాన్ని తీర్చిదిద్దిన ఒక ఇంట్రెస్టింగ్ లుక్‌ను రిలీజ్ చేశారు.
ఈ చిత్రాన్ని కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ నిర్మిస్తుండటం విశేషం. 2021 వేసవిలో విడుదల అంటూ పోస్టర్ మీద ప్రకటించడం ఆసక్తి రేకెత్తించేదే. ఇంకో 8 నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగబోతుండగా.. ఇండియన్-2 పెండింగ్‌లో ఉన్న ఈ సమయంలో లోకేష్‌తో సినిమా అనౌన్స్ చేసి 2021 వేసవి విడుదల అని కమల్ ప్రకటించడం ఆశ్చర్యకరం. కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెలుగులో ఓ సినిమా చేయడానికి లోకేష్ కమిట్మెంట్ ఇవ్వడం విశేషం.