ఈ ఏడాది డబ్బింగ్ సినిమాలు కొన్ని బాగానే వర్కౌట్ చేసుకున్న నేపథ్యంలో బాక్ అరణ్‌మనై 4 మీద కాస్తో కూస్తో ఆసక్తి రేగడానికి కారణం తమన్నా రాశి ఖన్నాల జోడి. దర్శకుడు సి సుందరే హీరో కావడంతో మన దగ్గర ప్రత్యేకంగా అంచనాలు ఏర్పడలేదు కానీ తమిళనాడులో ఈ ఫ్రాంచైజీకి క్రేజ్ ఉంది. గత ఇరవై నాలుగు గంటల్లో తమిళ వెర్షన్ టికెట్లు లక్షకు పైగా అమ్ముడుపోవడం దీనికి నిదర్శనం. మొదటి భాగం చంద్రకళ మన దగ్గరా బాగానే ఆడింది కానీ కళావతి, అంతఃపురం 3 ఆశించిన ఫలితాలు అందుకోలేదు. అందుకే తెలుగు ఓపెనింగ్స్ నెమ్మదిగా ఉన్నాయి. ఇంతకీ రిపోర్ట్ ఏముంటుందో చూద్దాం.
లాయర్ శివశంకర్ (సుందర్ సి) చెల్లెలు శివాని (తమన్నా భాటియా) ప్రేమించి పెళ్లి చేసుకుని, కుటుంబానికి ఇష్టం లేని కారణంగా ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. కొంతకాలం తర్వాత ఉన్నట్టుండి ఆమె ఆత్మహత్య చేసుకున్న కబురు వస్తుంది. భర్త కూడా మరణిస్తాడు. సోదరి చావు సహజం కాదని గుర్తించిన శివశంకర్ దీని వెనుక ఉన్న అసలు రహస్యాన్ని ఛేదించాలని నిర్ణయించుకుంటాడు. బాక్ అనే ఆత్మ ఉన్న విషయం బయటపడుతుంది. ఈ క్రమంలో ఎన్నో విస్తుపోయే పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇదంతా ఎలా జరిగింది, డాక్టర్ మాయ (రాశిఖన్నా) కున్న సంబంధం ఏమిటనేది తెరమీదే చూడాలి.
దర్శకుడు సుందర్ సి ఎలాంటి రిస్క్ చేయకుండా రెగ్యులర్ టెంప్లేట్ ని ఫాలో అయ్యాడు. గతంలో చూసినట్టే అనిపించే కామెడీ, మాములుగా నడిచే సన్నివేశాలు అసలు మైనస్ కాగా విఎఫెక్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో ఇతను తీసుకున్న శ్రద్ధ క్వాలిటీ పెంచేందుకు దోహదపడ్డాయి. బాక్, శివానిల మధ్య ఘర్షణ, క్లైమాక్స్ ని బాగా డీల్ చేసిన వైనం కొంత పర్వాలేదు అనిపించినా మిగిలినదంతా రొటీన్ గా సాగడం బాక్ ని యావరేజ్ దగ్గరే ఆపేసింది. గతంలో ఇలాంటి ఎన్నో చూసేశాం కాబట్టి ఎలాంటి ప్రత్యేకత అనిపించదు. హారర్ ఫ్యాన్స్ ని సైతం పూర్తిగా సంతృప్తి పరచలేదు.