సుధీర్ బాబుతో తలపడుతున్న ఆనంద్ దేవరకొండ

ఏదైనా డేట్ ఖాళీగా ఉండటం ఆలస్యం దాని మీద మీడియం, చిన్న సినిమాల నిర్మాతలు కర్చీఫ్ వేసుకోవడానికి పోటీ పడుతున్నారు. మే 31 సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సుధీర్ బాబు ‘హరోంహర’ని విడుదల చేయబోతున్నట్టు నిన్నే అధికార ప్రకటన ఇచ్చారు. జ్ఞాన సాగర్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఇంటెన్స్ డ్రామా మీద సుధీర్ బాబు చాలా నమ్మకం పెట్టుకున్నాడు. వరస డిజాస్టర్లతో బాగా తగ్గిపోయిన మార్కెట్ ని తిరిగి నిలబెడుతుందనే ధీమాతో ఎదురు చూస్తున్నాడు. టీజర్, పోస్టర్లు గట్రా ఆసక్తికరంగానే ఉన్నాయి. వచ్చే వారం నుంచి ప్రమోషన్లు పెంచుతారు.

అదే రోజు ఆనంద్ దేవరకొండ ‘గం గం గణేశా’ రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ఇవాళ అనౌన్స్ చేశారు. నిజానికిది నెలల తరబడి వాయిదా పడుతూ వస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఏదో ఒక సందర్భంలో తేదీలు చెప్పడం తర్వాత పోస్ట్ పోన్ కావడం జరిగాయి. బేబీ బ్లాక్ బస్టరయ్యాక ఆనంద్ కు డిమాండ్ పెరిగిన మాట వాస్తవం. కానీ గంగం గణేశా బేబీ కన్నా ముందు చేసిన సినిమానే టాక్ ఉంది. కాకపోతే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో సాగే థ్రిల్లర్ కాబట్టి పెర్ఫార్మన్స్ పరంగా ఆనంద్ మంచి వేరియేషన్స్ ఇచ్చాడనే మాట వినిపిస్తోంది. పబ్లిసిటీ స్పెషల్ గా ప్లాన్ చేస్తే బజ్ పెంచుకుంటూ పోవచ్చు.

ఓపెన్ గా చెప్పాలంటే హైప్ పరంగా రెండు సినిమాలు ఒకే స్టేజిలో ఉన్నాయి. ఓపెనింగ్ రోజు జనం థియేటర్లకు రావాలంటే అంత మేజిక్ చేసే కంటెంట్ ఉందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలగాలి. ఇది పెద్ద టాస్కే. కాకపోతే అప్పటికంతా ఎలెక్షన్లు అయిపోయి ఉంటాయి కాబట్టి పబ్లిక్ మాములు మూడ్ లోకి వచ్చేసి ఉంటారు. బడ్జెట్ పరంగా హరోంహరకు ఎక్కువ ఖర్చు పెట్టారు. సుధీర్ బాబుకి ఇది హిట్ కావడం చాలా అవసరం. ఆనంద్ దేవరకొండకి గంగం గణేశా హిట్ అయితే బోనస్సే. కాకతాళీయంగా రెండూ దేవుడికి సంబంధించిన మంత్రాలే కావడం గమనించాల్సిన విషయం.