జెర్సీ అభిమాన వర్షంలో తడిసిన నాని

నిన్న అయిదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జెర్సీ రీ రిలీజ్ చేశారు. హైదరాబాద్ క్రాస్ రోడ్స్ సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ కు నాని కుటుంబ సమేతంగా విచ్చేశాడు. రావడంలో పెద్ద విశేషం లేదు కానీ అక్కడికి వచ్చిన అభిమాన జన సందోహం, కొడుకు సంభ్రమాశ్చర్యాలతో అంతా చూస్తుండగా నాని మురిసిపోతున్న క్షణాలు, హాలు లోపల న్యాచురల్ స్టార్ కు స్వాగతం చెబుతూ ఫ్యాన్స్ చేసిన సందడి ఒకటా రెండా మర్చిపోలేని జ్ఞాపకాల వర్షంలో నాని తడిసి ముద్దయిపోయాడు. నిజానికి ఇంత రెస్పాన్స్ ఊహించలేదని నానితో పాటు వచ్చిన ఇతర టీమ్ సభ్యుల మాట.

వాస్తవానికి రీ రిలీజులు కమర్షియల్ సినిమాలకు మాత్రమే వర్కౌట్ అవుతాయి. అవి కూడా టైర్ 1 హీరోలు చేసినవే ఎక్కువ. కానీ జెర్సీ అలా కాదు. ఒక క్రికెటర్ జీవితంలో జరిగిన విషాదానికి సాక్షి. ఆటలో గెలిచి వ్యాధితో పోరాడలేక ఒదిగిపోయిన ఒక విజేత కథ. విపరీతమైన భావోద్వేగాలు, కోపాలు తాపాలు, సెంటిమెంట్ ఉంటాయి. అయినా సరే ఆడియన్స్ కి నచ్చేసింది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ప్రతి ఒక్కరిని తాకేలా తెరకెక్కించిన విధానం హత్తుకునేలా చేసింది. కొడుకు సెంటిమెంట్ పండించిన తీరు ఫ్యామిలీ ఆడియన్స్ ని చేరువ చేసింది. వందల కోట్లు రాకపోయినా ప్రత్యేకంగా నిలిచింది.

ఒకరకంగా చెప్పాలంటే జెర్సికి వచ్చిన స్పందన చూస్తే నిజంగా నాని ఎంత అదృష్టవంతుడో అనిపిస్తుంది. ఫార్ములాకు కట్టుబడకుండా క్లాసు మాస్ రెండూ బాలన్స్ అయ్యేలా కథలు ఎంచుకుంటున్న తీరు ఫాలోయింగ్ ని పెంచుతోంది. దసరా తర్వాత హాయ్ నాన్న చేయడమే దానికి నిదర్శనం. హిందీలో ఇదే జెర్సిని ఇదే దర్శకుడు షాహిద్ కపూర్ తో తీస్తే ఆడలేదు. నాని స్టామినాకి ఇదో ఉదాహరణ. ప్రస్తుతం సరిపోదా శనివారంలో బిజీగా ఉన్న నాని తర్వాత వరసగా సుజిత్, శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్టులను లైన్ లో పెట్టేశాడు. ఈ ఏడాది కేవలం ఒక్క రిలీజుతోనే సర్దుకోవాల్సి వస్తోంది.