ఇళయరాజాకు మళ్ళీ చుక్కెదురు

వెయ్యికి పైగా సినిమాలతో కోట్లాది అభిమానులను సంపాదించుకుని 90 దశకం నాటి పాటలతో కూడా ఇప్పటి జనరేషన్ ను మెప్పిస్తున్న మాస్ట్రో ఇళయరాజాకు తమిళంలోనే కాదు తెలుగులోనూ లక్షలాది ఫ్యాన్స్ ఉన్నారు. ఎస్బి బాలసుబ్రమణ్యం బ్రతికున్న సమయంలో తనకు రాయల్టీ చెల్లించే విషయంలో రాజా విభేదాలు తెచ్చుకుని కొంత కాలం ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉండటం చూశాం. తర్వాత ఈ ఇష్యూ సద్దుమణిగింది కానీ ముందుస్థాయిలో వాళ్ళ మధ్య అనుబంధం కనిపించలేదు. తర్వాత బాలు కన్నుమూశారు. చెన్నై ప్రసాద్ స్టూడియోస్ లో రూముకు సంబంధించిన ఇంకో వివాదం రాజాని ఇబ్బంది పెట్టింది.

తాజాగా మరోసారి ఇసైజ్ఞాని వార్తల్లోకి ఎక్కారు. తన సినిమా పాటల హక్కులను సొంతం చేసుకుని క్యాసెట్లు, సిడిలు, ఆన్ లైన్ జ్యుక్ బాక్సుల ద్వారా వ్యాపారం చేసిన ఎకో తదితర సంస్థలకు గడువు తీరిందని, దీంతో వాటికి సంబంధించిన కాపీ రైట్స్ తనకే చెందేలా తీర్పు ఇవ్వాలని ఇళయరాజా కోర్టుని ఆశ్రయించారు. కౌంటర్ వేసిన కంపెనీ ప్రతినిధులు తమకు అనుకూలంగా జడ్జ్ మెంట్ రావడంతో ఆనందం వ్యక్తం చేశారు. కాపీ హక్కులు ఇళయరాజాకు చెందవని, సదరు సంస్థలు ఆయా ఆల్బమ్స్ ని వాడుకోవచ్చని న్యాయస్థానం చెప్పింది. కథ ఇక్కడితో అయిపోలేదు.

రాజా తరఫు లాయర్ కోర్టులో వాదిస్తూ తన క్లయింట్ అందరికంటే గొప్పవాడనే రీతిలో చెప్పుకొచ్చారు. దీనికి స్పందించిన న్యాయ మూర్తులు సంగీత త్రిమూర్తులుగా చెప్పుకునే ముత్తుస్వామి దీక్షితర్, త్యాగరాజర్, శ్యామశాస్త్రి కంటే ఇళయరాజా గొప్పవారు కాదని ఉటంకిస్తూ తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేశారు. కాపీ రైట్స్ విషయంలో రాజా గెలిచే అవకాశాలు తక్కువని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫామ్ లో ఉన్నప్పుడు కాంట్రావర్సిల జోలికి వెళ్లని మాస్ట్రో ఇంత లేటు వయసులో పాటల హక్కుల కోసం పోరాటం చేయడం విశేషమే కానీ ఫలితమే దక్కడం లేదు.