హీరో హీరోయిన్ గొడవ పడ్డారు.. విషయమేంటంటే?

ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాల పట్ల ప్రేక్షకులను మొదట్నుంచి ప్రమోషన్లతో ఎంగేజ్ చేయాల్సిందే. అవి ఎంత విభిన్నంగా ఉంటే ప్రేక్షకులు అంతగా సినిమాతో కనెక్ట్ అవుతారు. ఇందుకోసం కొన్ని సార్లు రకరకాల స్టంట్లు చేయాల్సి ఉంటుంది. ప్రాంక్స్ కూడా ట్రై చేయాల్సి వస్తుంది. ఇప్పుడు టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి, గ్లామరస్ హీరోయిన్ నభా నటేష్ కలిసి ఇలాంటి స్టంటే ఒకటి చేశారు. సోషల్ మీడియాలో వీళ్లిద్దరి గొడవ చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ అసలు విషయం ఏంటంటే.. వాళ్లిద్దరూ కలిసి చేయబోయే ఓ సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగానే ఈ గొడవ జరిగిందని చాలామందికి తెలియదు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

నభా నటేష్ తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో ఆమె డార్లింగ్ డార్లింగ్ అంటూ ప్రభాస్ తన చిత్రాల్లో పలికే ఊతపదాన్ని ఇమిటేట్ చేస్తూ కనిపించింది. ఈ వీడియోకు ‘‘హాయ్ డార్లింగ్స్ ఎలా ఉన్నారు’’ అనే కామెంట్ కూడా పెట్టింది. ప్రభాస్ మీద ఉన్నట్లుండి నభాకు ఇంత ఫోకస్ ఏంటి.. రెబల్ స్టార్‌కు ఆమె ఫ్యాన్ గర్లా అనుకున్నారు నెటిజన్లు. కాగా ఈ వీడియోపై ప్రియదర్శి స్పందిస్తూ.. ‘‘వావ్ సూపర్ డార్లింగ్, కిరాక్ ఉన్నావ్’’ అని కామెంట్ పెట్టాడు. తనను డార్లింగ్ అని సంబోధించేసరికి నభాకు కోపం వచ్చింది. ‘‘ఐపీసీ సెక్షన్ 354 ఏ ప్రకారం తెలియని మహిళను ఇలా డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపులతో సమానం.

మిస్టర్ కామెంట్ చేసే ముందు మాటలు జాగ్రత్త’’ అని స్పందించింది. దీనికి ప్రియదర్శి బదులిస్తూ.. ‘‘మనం పరిచయం లేని వ్యక్తులమా? మీరైతే డార్లింగ్ అనొచ్చు. మేం అంటే మాత్రం సెక్షన్లా. లైట్ తీస్కో డార్లింగ్ అన్నాడు’’ అన్నాడు. మళ్లీ నభా స్పందిస్తూ.. ‘‘ఆహా.. హద్దులు దాటి ప్రవర్తించకు చూస్కుందాం’’ అంది. వీళ్లిద్దరి సంభాషణ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఐతే వీళ్లిద్దరూ కలిసి ‘డార్లింగ్’ అనే సినిమా చేయబోతున్నారని.. ఆ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ రాబోయేముందు ఇలా ప్రాంక్ చేశారని భావిస్తున్నారు.