92లో వెంకటేష్ 24లో నారా రోహిత్

విభిన్నమైన కథలు ఎంచుకుంటాడని పేరున్న నారా రోహిత్ ఆ మధ్య కొంత గ్యాప్ ఇచ్చినా ఈ సంవత్సరం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వస్తున్నాడు. వచ్చే వారం ఏప్రిల్ 25 విడుదల కాబోతున్న ప్రతినిథి 2 మీద ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. వర్తమాన రాజకీయాల మీద సెటైర్లతో పాటు సామజిక సందేశాన్ని కూడా జోడించారట. టీవీ 5 మూర్తి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇదిలా ఉండగా దీనికి పూర్తిగా విరుద్ధమైన జానర్ లో సెప్టెంబర్ 5న సుందరకాండతో రాబోతున్నాడు రోహిత్. ఈ టైటిల్ కు విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ కి మంచి ఎమోషనల్ కనెక్షన్ ఉంది.

1992లో కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో సుందరకాండ వచ్చింది. ఒక స్టూడెంట్ పాఠాలు చెప్పే టీచర్ ని ప్రేమిస్తే ఎలా ఉంటుందనే పాయింట్ తో రూపొంది సూపర్ హిట్ దక్కించుకుంది. కీరవాణి పాటలు, వెంకీ మీనాల జోడి, కామెడీతో సమానంగా పండిన ఎమోషన్ వెరసి ఎప్పటికి మర్చిపోలేని క్లాసిక్ గా నిలిపాయి. ఆ తర్వాత ఛార్మీతో బాపుగారు ఇంకో సుందరకాండ తీశారు కానీ అది మాత్రం ఫెయిలయ్యింది. ఎంతగా అంటే సాధారణ ప్రేక్షకులకు అదొకటి వచ్చిందన్న సంగతే గుర్తు లేనంతగా. సో ఈ పేరు అలా వెంకటేష్ బ్రాండ్ మీద ఆడియన్స్ మైండ్ లో ఉండిపోయింది.

ఇవాళ వదిలిన సుందరకాండ ప్రీ టీజర్ ని డిఫరెంట్ గా చూపించడం బాగుంది. టాలీవుడ్ లో వచ్చిన క్లాసిక్ లవ్ స్టోరీస్ ఖుషి, ఆర్య, గీతాంజలి, బొమ్మరిల్లు, ఏ మాయ చేశావేలను ఉదాహరణగా చెబుతూ వాటికి భిన్నంగా మా సిద్దు ప్రేమకథ ఉంటుందని రోహిత్ తో చెప్పించడంలో క్రియేటివిటీ చూపించారు. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయమవుతున్న సుందరకాండలో పెద్ద క్యాస్టింగే ఉంది. లియోన్ జేమ్స్ సంగీతం సమకూరుస్తున్నాడు. గుట్టుచప్పుడు కాకుండా షూటింగ్ జరుపుకుంటున్న ఈ లవ్ ఎంటర్ టైనర్ తో మళ్ళీ సోలో తరహా విజయం రోహిత్ అందుకుంటాడేమో చూడాలి.