సరైన సినిమాల్లేక థియేటర్ల ఆర్తనాదాలు

పని చేసే సిబ్బందికి క్రమం తప్పకుండా జీతాలివ్వాలన్నా, ఖర్చులకు సరిపడా సొమ్ములు కావాలన్నా ఏ థియేటర్ కైనా ఫీడింగ్ అవసరం. అంటే కనీసం సగం హాలు నిండేంత జనం రోజుకు రెండు ఆటలకు వస్తే ఏదోలా మేనేజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఏ పదో పరకో ఆడియన్స్ వచ్చి షోలు వేయమంటే కనీసం కరెంటు బిల్లులు కిట్టుబాటు కాలేని కలెక్షన్లు వస్తాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ దగ్గర ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మొన్న శుక్రవారం రిలీజైన గీతాంజలి మళ్ళీ వచ్చింది, లవ్ గురు, శ్రీరంగనీతులు, డియర్, బడేమియా చోటేమియా ఇవేవి కనీస స్థాయిలో జనాలను ఆకట్టుకోలేకపోయి.

ఉన్నంతలో నాలుగో వారంలో అడుగు పెడుతున్న టిల్లు స్క్వేర్ స్టడీగా ఉండగా ది ఫ్యామిలీ స్టార్ చేతులు ఎత్తేసింది. హైదరాబాద్ లో మన తెలుగు సినిమాల కంటే మలయాళం సరుకైన ఆవేశం, మంజుమ్మల్ బాయ్స్, వర్షంగలక్కు శేషంలకు మొన్న ఆదివారం టికెట్లు దొరకలేదంటే ట్రెండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవి అందుబాటులో లేని జిల్లా కేంద్రాలు, పట్టణాలు కేవలం టిల్లు స్క్వేర్ ని మాత్రమే నమ్ముకుని రన్ కావడం లేదుగా. దీంతో సహజంగానే క్యాన్సిలవుతున్న షోలు భారీగా ఉన్నాయని ట్రేడ్ టాక్. పట్టుమని పది మంది రాకపోతే ఎగ్జిబిటర్ వెనుకడుగు వేయడం కన్నా ఏం చేస్తాడు.

ఇది ఇంకో వారం పది రోజులు కొనసాగేలా ఉంది. రాబోయే శుక్రవారం రిలీజవుతున్న వాటిలో ఒక్క పారిజాత పర్వం మాత్రమే కొంత బజ్ ని మోసుకొస్తోంది కానీ ఓపెనింగ్స్ వచ్చేందుకు అది కూడా సరిపోయేలా ఉంది. పాజిటివ్ టాక్ వచ్చి అనూహ్యంగా పికప్ అయితే చెప్పలేం కానీ మార్నింగ్ షో దాకా గ్యారెంటీగా చెప్పలేం. మిగిలిన చిత్రాలకు బజ్ రావడం పెద్ద సవాల్ కానుంది. మొత్తం నాలుగు నెలల బాక్సాఫీస్ ని పరిగణనలోకి తీసుకుంటే మహా అయితే ఓ పది లోపే సినిమాలు కమర్షియల్ గా వర్కౌట్ అయ్యాయి. మిగిలినవన్నీ బ్రేక్ ఈవెన్ కాదు కదా కనీసం వీకెండ్ పరీక్షను కూడా దాటలేకపోయాయి.