వేసవి సీజన్ అంటే సినిమాలకు పండగ లాంటిది. ఈ సీజన్లో పెద్ద పెద్ద సినిమాలు రిలీజవుతాయి. మార్చి చివరి నుంచే బాక్సాఫీస్ హంగామా మొదలైపోతుంది. పరీక్షలు ముగించుకుని సెలవుల్లో అడుగు పెట్టే విద్యార్థులకు తోడు అందరూ సినిమాలు చూడ్డానికి ఈ సీజన్లో బాగా ఉత్సాహం చూపిస్తారు.
ప్రతి వారం క్రేజీ సినిమాలు రిలీజ్ కావడం.. థియేటర్లు జనాలతో కళకళలాడడం మామూలే. కానీ కొన్నేళ్లుగా వేసవిలో ఆశించిన స్థాయిలో సందడి కనిపించడం లేదు. కరోనా వల్ల రెండేళ్లు వేస్ట్ అయితే.. గత ఏడాది టాలీవుడ్ ప్లానింగ్ దెబ్బ తినడం వల్ల వేసవి సీజన్ కళ తప్పింది.
ఈ ఏడాది పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండే సంకేతాలు కనిపిస్తున్నాయి. ‘టిల్లు స్క్వేర్’ మూవీతో సీజన్ బాగానే ఆరంభమైనా.. తర్వాతి వారం నుంచే కళ తప్పింది. ‘ఫ్యామిలీ స్టార్’ నిరాశపరచడంతో బాక్సాఫీస్‌లో సందడి తగ్గింది.
గత వారాంతంలో వచ్చిన ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సహా ఏ సినిమా ప్రభావం చూపలేకపోయాయి. వీకెండ్ అయ్యాక కొత్త సినిమాలకు కనీస స్థాయిలో కూడా జనాలు లేరు. కొత్త చిత్రాలు వేటికీ థియేటర్లలో 50 మంది జనం కూడా లేని పరిస్థితి. ఆక్యుపెన్సీలు డబుల్ డిజిటల్ దాటక షోలు క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి.
ఈ స్లంప్ ఒకట్రెండు వారాలకు పరిమితం అయ్యే సూచనలు కూడా కనిపించడం లేదు. రాబోయే వారాల్లో కూడా బాక్సాఫీస్‌ను కళకళలాడించే సినిమాలేవీ కనిపించడం లేదు. ఆ ఒక్కటి, లవ్ మి లాంటి చిన్న సినిమాలే వస్తున్నాయి.
వాటికి అంత హైప్ ఏమీ లేదు. భారీ చిత్రాలు ఒక్కొక్కటిగా వేసవి రేసు నుంచి తప్పుకుంటే.. చివరి ఆశ అయిన ‘కల్కి’ సైతం ఈ సీజన్లో వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మొత్తంగా ఈ వేసవి గత ఏడాది కంటే వెలవెలబోయేలా కనిపిస్తోంది.