వాళ్లు శోకాలు పెడుతుంటే.. వీళ్ల కేరింతలు

మామూలుగా వసూళ్ల పంట పండే సమ్మర్ సీజన్లో ఈసారి సరైన కలెక్షన్లు లేక ఇండియాలో వివిధ ఇండస్ట్రీలు అల్లాడుతున్నాయి. ఓవైపు ఐపీఎల్, ఇంకోవైపు ఎన్నికల హంగామా కారణంగా జనాలు థియేటర్లు రావడానికి కొంత వెనుకంజ వేస్తున్నారు. అదే సమయంలో సరైన సినిమాలు కూడా రిలీజ్ కాకపోవడం మైనస్ అవుతోంది. కొత్త ఏడాదిలో సంక్రాంతి తర్వాత టాలీవుడ్ స్లంప్ చూస్తోంది. ‘టిల్లు స్క్వేర్’ తప్ప ఏ సినిమా గత మూడు నెలల్లో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు.

బాలీవుడ్ పరిస్థితి రోజు రోజుకూ దయనీయంగా తయారవుతోంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న పెద్ద సినిమాలు ఉస్సూరుమనిపిస్తున్నాయి. గత వీకెండ్లో రిలీజైన ‘బడేమియా చోటేమియా’ బ్యాడ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. ‘మైదాన్’ సినిమాకు టాక్ బాగున్నా వసూళ్లు లేవు. ఇంకోవైపు తమిళ ఇండస్ట్రీలో కూడా ఈ మధ్య సరైన సినిమాలు లేవు. దేశంలో వసూళ్ల పరంగా టాప్‌లో ఉండే ఈ మూడు ఇండస్ట్రీలు సమ్మర్లో వెలవెలబోతున్నాయి.

కానీ మలయాళ ఇండస్ట్రీ మాత్రం ఎన్నడూ లేనంత జోష్‌తో సాగిపోతోంది. అన్ సీజన్ అయిన ఫిబ్రవరిలో మాలీవుడ్‌ నాలుగు వారాల్లో నాలుగు బ్లాక్‌బస్టర్లు చూసింది. అన్వేషిప్పిన్ కండేదుం, ప్రేమలు, భ్రమయుగం, మంజుమ్మల్ బాయ్స్ కలిపి 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఔరా అనిపించాయి. గత నెలలో పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమా ‘ది గోట్ లైఫ్’ సైతం అదరగొట్టింది. ఆ సినిమా వసూళ్లు రూ.130 కోట్లను దాటిపోయాయి.

ఇక ఏప్రిల్లో కూడా మాలీవుడ్ ఊపు మామూలుగా లేదు. గత వీకెండ్లో రిలీజైన ఫాహద్ ఫాజిల్ మూవీ ‘ఆవేశం’ బ్లాక్‌బస్టర్ టాక్, వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇండియన్ బాక్సాఫీస్ మొత్తంలో ఇదే ఇప్పుడు టాప్‌లో కొనసాగుతోంది. దీంతో పాటు రిలీజైన ‘ప్రేమం’ స్టార్ నివిన్ పౌలీ మూవీ ‘వర్షంగలక్కు శేషం’ సైతం అదిరిపోయే టాక్ తెచ్చుకుంది. మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇది ‘హృదయం’ దర్శకుడు వినీత్ శ్రీనివాసన్ రూపొందించిన మూవీ. ఒకే వీకెండ్లో రెండు బ్లాక్‌బస్టర్లు పడ్డాయి మాలీవుడ్‌కు. ఓవైపు మిగతా ఇండస్ట్రీలన్నీ శోకాలు పెడుతుంటే మాలీవుడ్ మాత్రం వరుస బ్లాక్‌బస్టర్లతో సంతోషంలో మునిగి తేలుతుండడం విశేషం.