కంగువ చుట్టూ ప్యాన్ ఇండియా పద్మవ్యూహం

సూర్య ద్విపాత్రాభినయంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న కంగువ విడుదల తేదీని నిర్ణయించడంలో నిర్మాతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇవాళ వదిలిన కొత్త పోస్టర్ లో 2024 రిలీజ్ అన్నారు తప్పించి డేట్ ని ప్రస్తావించలేదు. అంటే ఈ సంవత్సరం వస్తుందని చెప్పడమే కానీ ఎప్పుడనే క్లారిటీ ఇవ్వలేదు. కంగువ చుట్టూ ఒకరకమైన ప్యాన్ ఇండియా పద్మవ్యూహం అల్లుకుని ఉంది. మేలో కల్కి 2898 ఏడి, జూన్ లో భారతీయుడు 2, ఆగస్ట్ లో పుష్ప 2, సెప్టెంబర్ లో ఓజి – శనివారం నాది, అక్టోబర్ లో దేవర – గేమ్ ఛేంజర్ లాంటి భారీ చిత్రాలన్నీ నువ్వా నేనాని పోటీ పడుతున్నాయి.

ఇక్కడితో అయిపోలేదు. వరసగా రెండు నెలల్లో విజయ్ ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం, రజనీకాంత్ వెట్టాయన్ లు ఖచ్చితంగా రావాలని ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. సో కంగువకు అతి పెద్ద సవాల్ పైన చెప్పిన అన్నింటిని దాటుకుని ఎప్పుడు రావాలనేది. పోనీ డిసెంబర్ చూద్దామా అంటే మరీ లేట్ అయిపోతుంది. సూర్యకేమో 2025 సంక్రాంతి మీద కన్ను ఉందట. కానీ కంగువలో యువి క్రియేషన్స్ కు భాగస్వామ్యం ఉంది. తెలుగు వ్యవహారాలన్నీ వాళ్లే చూస్తున్నారు. జనవరి 10కి వీళ్లదే చిరంజీవి విశ్వంభర ఉంది కాబట్టి ఆ ఆప్షన్ సాధ్యం కాదు. ఏదైనా అనూహ్య పరిణామం జరిగితే తప్ప.

సో వీళ్ళలో ఎవరో ఒకరు తప్పుకుంటేనో లేదా వాయిదా వేసుకుంటేనో కంగువకు ఒత్తిడి తగ్గుతుంది. కానీ అదంత సులభంగా తేలే వ్యవహారం కాదు. అందుకే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసినా దాంట్లో రిలీజ్ డేట్ ఇవ్వలేకపోయారు. సిరుతై శివ దర్శకత్వంలో రూపొందిన కంగువ టైం ట్రావెల్ కాన్సెప్ట్ మీద గతం, వర్తమానం బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. సూర్య రెండు గెటప్స్ విభిన్నంగా ఉన్నాయి. బాబీ డియోల్ విలన్ గా చేశాడు. రెండు భాగాలుగా తీస్తున్నారనే టాక్ ఉంది కానీ మేకర్స్ ఆ విషయాన్ని ఇంకా ధృవీకరించడం లేదు. కోలీవుడ్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న మూవీ ఇది.