మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన చిత్రాల్లో ‘సైరా నరసింహారెడ్డి’ ఒకటి. స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సినిమా చేయాలని ఎన్నో ఏళ్ల పాటు కలలు కన్న చిరంజీవి.. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ఈ సినిమా చేశారు. ‘ఖైదీ నంబర్ 150’తో రీఎంట్రీ ఇచ్చాక చిరు చేసిన చిత్రమిది.
సొంత బేనర్లో రూ.200 కోట్లకు పైగా బడ్జెట్లో రాజీ లేకుండా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు రామ్ చరణ్. ఆ సమయానికి ఇది చాలా రిస్క్ అనిపించినా.. చిరు డ్రీమ్ ప్రాజెక్టు విషయంలో చరణ్ రాజీ పడలేదు. ఐతే ఈ సినిమాకు మంచి టాకే వచ్చినా అంచనాలకు తగ్గట్లుగా ఆడలేదు. ఆ టైంకి సినిమాను సూపర్ హిట్ అని ప్రచారం చేశారు కానీ.. దీని వల్ల మెగా ఫ్యామిలీకి నష్టాలు తప్పలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఇప్పుడు చిరంజీవే స్వయంగా ‘సైరా’ నష్టాలు మిగిల్చిన విషయాన్ని అంగీకరించారు. ప్రముఖ క్రిటిక్ రాజీవ్ మసంద్‌తో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో ‘సైరా’ గురించి చిరు మాట్లాడారు. “ఇప్పటిదాకా నేను చేసిన పాత్రలు, సినిమాలతో పూర్తి సంతృప్తిగా ఉన్నానని చెప్పలేను. మనం ఎదురుచూసే పాత్రలు ప్రతిసారీ రావు. వాటంతట అవే రావాలి. నాకు స్వాతంత్ర్య సమరయోధుడిగా నటించాలని ఉండేది. ‘సైరా’తో ఆ కోరిక తీరింది. కానీ ఆ చిత్రం సంతృప్తికర ఫలితాన్నివ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్‌గా నిలిచింది. మిగతా చోట్ల బాగా ఆడింది. ఆ సినిమా వల్ల చాలానే నష్టపోయాం. నా సంతృప్తి కోసం సినిమాలు చేస్తే ప్రొడ్యూసర్ జేబు ఖాళీ అవుతుంది. గతంలో ‘రుద్రవీణ’ లాంటి గొప్ప సినిమా చేశాను. చాలా మంచి పేరొచ్చింది. కానీ ఈ సినిమాను నిర్మించిన నా తమ్ముడు నాగబాబుకు డబ్బులు రాలేదు. అందుకే తర్వాత నిర్మాతల బాగు కోసం కమర్షియల్ సినిమాల వైపు అడుగులు వేయాల్సి వచ్చింది” అని చిరు చెప్పారు.