కొన్ని సినిమాలకు విమర్శకులు అద్భుతమైన ప్రశంసలు కురిపిస్తారు. ప్రీమియర్ షోల ద్వారా ఆహా ఓహో అంటూ అభినందనలు వెల్లువెత్తుతాయి. తీరా చూస్తే సాధారణ ప్రేక్షకుల నుంచి ఆశించిన మద్దతు ఉండదు. మొన్నీమధ్యే ది గోట్ లైఫ్ ఆడు జీవితంకు కేరళలో బ్రహ్మాండమైన ఆదరణ దక్కితే తెలుగుతో సహా ఇతర భాషల్లో కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇటీవలే విడుదలైన మైదాన్ అదే తరహా పరిస్థితి చవి చూస్తోంది. 1950 ప్రాంతంలో భారతదేశపు ఫుల్ బాల్ ఆటకు జీవం పోసిన సయ్యద్ అబ్దుల్ రహీం బయోపిక్ గా రూపొందిన ఈ మూవీకి ఆశించిన స్పందన రావడం లేదు.
మొదటి రోజు దేశవ్యాప్తంగా కేవలం 7 కోట్ల 25 లక్షలు మాత్రమే వసూలైనట్టు ట్రేడ్ పండితుల రిపోర్ట్. అజయ్ దేవగన్ లాంటి ఇమేజ్ ఉన్న స్టార్ హీరోకు వచ్చే వసూళ్లు కావివి. ఇదెక్కకడి టార్చర్ అనిపించుకున్న బడేమియా చోటేమియానే మెరుగైన నెంబర్లు నమోదు చేయడం అసలు ట్విస్టు. అలా అని దానికేం జనం ఎగబడి పోవడం లేదు కానీ సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు ఈ పరిణామాలు ఎంత మాత్రం మింగుడుపడటం లేదు. ముఖ్యంగా మైదాన్ కొచ్చిన పాజిటివ్ టాక్ చూసి చెక్ దే ఇండియా రేంజ్ లో బాగా ఆడేస్తుందని బోలెడు ఆశించారు.
రంజాన్ పండగ సందర్భంలోనూ ఇలా జరగడం అనూహ్యం. ప్రతి సంవత్సరం ఈద్ కి సల్మాన్ ఖాన్ సినిమా వచ్చిన ప్రతిసారి టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు కురిసేవి. అలాంటిది మైదాన్ కు ఇలా జరగడం అంతు చిక్కడం లేదు. ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలు ఇప్పటికే బోలెడు రావడం, క్రికెట్ కున్నంత క్రేజ్ ఇండియాలో ఫుట్ బాల్ కు లేకపోవడం లాంటి కారణాలతో పాటు మరీ గొప్పగా అనిపించే రేంజ్ లో దర్శకుడు అమిత్ శర్మ తీయలేకపోవడం ప్రతికూలంగా మారింది. కొన్నిసార్లు అంతే. బాగుందనిపించుకున్న సినిమాలు కూడా ఇలా బాక్సాఫీస్ దగ్గర ఎదురీదాల్సి ఉంటుంది.