యష్ రావణుడే కాదు రథసారధి కూడా

భారతీయ సినీ చరిత్రలో అత్యంత ఖరీదైన సినిమాగా చెప్పబడుతున్న రామాయణం వైపు అడుగులు వేగంగా పడుతున్నాయి. మెయిన్ ఆర్టిస్టులు లేని సీన్లను దర్శకుడు నితీష్ తివారి ఆల్రెడీ చిత్రీకరించడం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. సెట్స్ తాలూకు ఫోటోలు కొన్ని లీకవ్వడంతో యూనిట్ అలెర్ట్ అయిపోయి వాటిని తీయించేసింది. రన్బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటించబోయే ఈ ఎపిక్ డ్రామాలో కెజిఎఫ్ యష్ రావణుడిగా చేస్తాడనే ప్రచారం ముందు నుంచి ఉంది కానీ దానికి సంబంధించి ఎలాంటి ధృవీకరణ ఇప్పటిదాకా రాలేదు. ఫైనల్ గా అనుమానం తీరిపోయింది.

కేవలం రావణుడిగా మాత్రమే కాక నిర్మించే రథసారధుల్లో ఒకడిగా యష్ భాగం పంచుకోబోతున్నాడు. ఈ మేరకు నమిత్ మల్హోత్రాతో దిగిన ఒక ఫోటోని సోషల్ మీడియాలో బయటికి రావడంతో అఫీషియల్ క్లారిటీ వచ్చేసింది. రామాయణం మొత్తం మూడు భాగాల్లో రూపొందనుంది. సుమారు అయిదు వందల కోట్లకు పైగానే బడ్జెట్ కేటాయించబోతున్నట్టు ముంబై టాక్. వేసవిలో షూటింగ్ మొదలుపెట్టి మొదటి భాగాన్ని 2025లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కనివిని ఎరుగని క్యాస్టింగ్ ని దీని కోసం సెట్ చేయబోతున్నారు. అయితే యష్ ఎంత పెట్టుబడి పెడతాడనేది చెప్పడం లేదు.

ఇన్ సైడ్ సోర్స్ చెబుతున్న దాని ప్రకారం పారితోషికం బదులు యష్ ఇందులో నిర్మాణ భాగస్వామ్యాన్ని తీసుకుంటున్నాడట. ప్రాధమికంగా దీని విలువ నూటా యాభై కోట్ల రూపాయలు ఉంటుందని వినికిడి. ప్రస్తుత మార్కెట్ కోణంలో చూసుకుంటే ఇది పెద్ద మొత్తమే. ఆసక్తికరమైన మరో విషయం ఏంటంటే రావణుడి ఎంట్రీ సెకండ్ పార్ట్ నుంచి ఉంటుందట. అంటే రామసీతలు లక్ష్మణ సమేతంగా వనవాసానికి వెళ్ళాక మొదటి భాగానికి శుభం కార్డు వేస్తారు. టాక్సిక్ లో బిజీగా ఉన్న యష్ ఈ ఏడాది చివర్లో రామాయణం సెట్స్ లో అడుగు పెట్టొచ్చు. ప్లానింగ్ అయితే బాగా చేసుకుంటున్నారు.