పేరుకి మలయాళ హీరోనే అయినా దుల్కర్ సల్మాన్ కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. మహానటి మొదట గుర్తింపు తేగా సీతారామం ఏకంగా మర్చిపోలేని బ్లాక్ బస్టర్ ఇచ్చింది. కనులు కనులు దోచాయంటే లాంటి డబ్బింగ్ మూవీస్ ఇక్కడా మంచి వసూళ్లు సాధించాయి. అందుకే కథ, దర్శకుడు నచ్చితే టాలీవుడ్ ఆఫర్లకు నో చెప్పడం లేదు. ఈ క్రమంలో వస్తున్నదే లక్కీ భాస్కర్. గత ఏడాది దర్శకుడు వెంకీ అట్లూరితో ధనుష్ సార్ రూపంలో సూపర్ హిట్ అందుకున్న సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈసారి అతనితోనే దుల్కర్ కాంబోని సెట్ చేసింది. ఇవాళ టీజర్ ద్వారా కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు.
అది నాలుగైదు దశాబ్దాల వెనుకటి కాలం. భాస్కర్(దుల్కర్ సల్మాన్) ఒక మాములు మధ్యతరగతి బ్యాంక్ ఉద్యోగి. రోజూ లక్షల డబ్బుని కౌంటర్లో లావాదేవీల రూపంలో నడిపిస్తున్నా దాన్ని అందుకోలేని స్థితిలో ఉంటాడు. అయితే పైసా పైసా కూడబెట్టే అతని మనస్తత్వం బయటి వాళ్లకు అంతు చిక్కదు. అన్నట్టు ఇతనికో ప్రేయసి(మీనాక్షి చౌదరి) ఉంటుంది. అనుకోకుండా ఒక రోజు భాస్కర్ దగ్గర లెక్కబెట్టలేనంత సొమ్ము ఉందని జనాలకు తెలుస్తుంది. నెల జీతం మీద బ్రతికే భాస్కర్ అంత డబ్బు ఎలా సంపాదించాడనేది సస్పెన్స్. దాన్నే తెరమీద చూడమంటున్నారు.
వింటేజ్ కాలం నాటి విజువల్స్ తో ఆసక్తికరంగా కట్ చేశారు. తక్కువ నిడివి ఉన్నప్పటికీ అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉన్న ఆర్ట్ వర్క్ తో పాటు జివి ప్రకాష్ కుమార్ నేపధ్య సంగీతం డిఫరెంట్ ఫీల్ ఇచ్చాయి. హైపర్ ఆది లాంటి ఒకరిద్దరు మినహా క్యాస్టింగ్ ని ఎక్కువ రివీల్ చేయలేదు. ట్రైలర్ కాదు కాబట్టి ఇంత కన్నా ఎక్స్ పెక్ట్ చేయలేం. ప్యాన్ ఇండియా ప్రధాన భాషలు తెలుగు, మలయాళం, తమిళంలో ఒకేసారి విడుదల కాబోతున్న లక్కీ భాస్కర్ ని జూలైలో తీసుకొస్తారు. డేట్ చెప్పలేదు కానీ అంచనాలు సృష్టించడంలో లక్కీ భాస్కర్ టీమ్ సక్సెస్ అయ్యింది.