మంచి తేదీ కోసం అల్లరోడి తిప్పలు

మహర్షి నుంచి సీరియస్ పాత్రలకు షిఫ్ట్ అయిపోయి కొంత కాలం కామెడీకి దూరంగా ఉన్న అల్లరి నరేష్ తిరిగి తన పాత స్కూలుకు వచ్చి చేసిన సినిమా ఆ ఒక్కటి అడక్కు. తండ్రి ఈవివి సత్యనారాయణ ఇచ్చిన ఆల్ టైం క్లాసిక్ టైటిల్ కావడంతో దీని మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. మల్లి అంకెం దర్శకత్వం వహించగా జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. టీజర్ గట్రా ప్రమోషనల్ మెటీరియల్ జనాలను బాగానే ఆకట్టుకున్నాయి. వాస్తవానికి ఇది మార్చి 22నే విడుదల కావాల్సింది. అయితే ప్రమోషన్, బిజినెస్ ఆలస్యం కావడంతో వాయిదా వేసుకున్నారు.

ఇప్పుడవన్నీ కొలిక్కి వచ్చాయి. ఆ ఒక్కటి అడక్కుకి లైన్ క్లియరయ్యింది కానీ డేట్ దొరకడం పెద్ద సమస్యగా మారింది. ఒకవేళ గత నెల ఓం భీమ్ బుష్ తో పాటు వచ్చి ఉంటే మంచి రన్ దక్కే అవకాశం ఉండేది. కానీ తప్పని పరిస్థితుల్లో వదిలేసుకున్నారు. పోనీ ఏప్రిల్ 5 ప్లాన్ చేసుకున్నా సరిపోయేది. కానీ ది ఫ్యామిలీ స్టార్ మీదున్న ప్రీ రిలీజ్ బజ్ చూసి ఆగిపోయారు. నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏప్రిల్ 19. సమయం లేదు కాబట్టి ఇదీ సాధ్యం కాదు. ఏప్రిల్ 25 దిల్ రాజు బ్యానర్ నుంచి లవ్ మీ, విశాల్ రత్నం, తమన్నా అరన్మయి 4 ఉన్నాయి కాబట్టి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మే నెల ఆప్షన్లు కూడా చూస్తున్నారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి కనక దానికి అనుగుణంగానే తేదీని ప్రకటించలేదు. పైగా కల్కి ఎప్పుడు వస్తుందో ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఆ ఒక్కటి అడక్కు హిట్ కావడం అల్లరి నరేష్ కు చాలా కీలకం.ఎందుకంటే తిరిగి ఎంటర్ టైన్మెంట్ జానర్ కు రావడం సరైన నిర్ణయమేనని ఋజువు కావాలంటే ఒక పెద్ద హిట్టు పడాలి. నిర్మాణంలో ఉన్న బచ్చల మల్లి కూడా వినోదాన్ని ఆధారంగా చేసుకున్నదే. కామెడీ సినిమాలతో జనాలను నవ్వించడం పెద్ద టాస్క్ గా మారిపోయిన ట్రెండ్ లో కొత్త తరాన్ని మెప్పించడం తన లాంటి హీరోలకు సవాల్ గా మారింది.