శర్వా.. ఆగట్లేదసలు

టాలీవుడ్ యువ కథనాయకుడు శర్వానంద్ కెరీర్ కొన్నేళ్లుగా ఒడుదొడుకులతో సాగుతోంది. ఒకప్పుడు రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మహానుభావుడు లాంటి సక్సెస్‌లతో మంచి ఊపుమీదుండేవాడు శర్వా. కానీ తర్వాత అతణ్ని వరుసగా పరాజయాలు పలకరించాయి. పడి పడి లేచె మనసు, రణరంగం, జాను, శ్రీకారం, మహాసముద్రం, ఆడాళ్లు మీకు జోహార్లు.. ఇలా వరుసగా అతడి సినిమాలు నిరాశపరిచాయి.

చివరగా శర్వా నుంచి ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాకు మంచి టాక్ అయితే వచ్చింది కానీ.. వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. కాకపోతే శర్వాకు కొంచెం ఊరటనిచ్చింది. ఐతే కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేకపోయినా.. శర్వాకు అవకాశాలకైతే లోటు లేదు. ఆల్రెడీ అతను మూడు క్రేజీ ప్రాజెక్టులు లైన్లో పెట్టాడు.

శ్రీరామ్ ఆదిత్యతో ‘మనమే’ అనే సినిమాతో పాటు ‘లూజర్ సిరీస్ దర్శకుడు అభిలాష్ రెడ్డితో ఓ చిత్రం.. ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజుతో మరో సినిమా అనౌన్స్ చేశాడు శర్వా. ఈ మూడు వివిధ దశల్లో ఉండగా.. ఇప్పుడు శర్వా ఇంకో సినిమాకు రెడీ అయిపోయాడు.

‘ఘాజి’తో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంకల్ప్ రెడ్డితో శర్వా ఓ సినిమా చేయబోతున్నాడట. ఇది పాన్ ఇండియా స్థాయిలో పెద్ద బడ్జెట్లో తెరకెక్కే మూవీ అట. ‘ఘాజి’ తర్వాత ‘అంతరిక్షం’ సినిమాతో నిరాశపరిచాడు సంకల్ప్. ఆపై అతను బాలీవుడ్ హీరో విద్యుత్ జమ్వాల్‌తో ఓటీటీ మూవీ ‘ఐబీ 71’ చేశాడు. అది ఓ మోస్తరు స్పందన తెచ్చుకుంది. ఇప్పుడు అతను తిరిగి శర్వా మూవీతో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు సమాచారం.