ఐపీఎల్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ తరఫున అదరగొడుతున్న నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. విశాఖపట్నంకు చెందిన ఈ టాలెంటెడ్ క్రికెటర్ సత్తా ఏంటో ఈ సీజన్ లో తెలిసొచ్చింది. నిన్నటి ఇన్నింగ్స్ లో అతను చేసిన పరుగులు, కొట్టిన సిక్సులు, బౌండరీల గురించి ఎంత చెప్పినా తక్కువే. లోకల్ ఫ్రాంచైజ్ కే ఇంత అద్భుతంగా ఆడుతున్న వాడు ఇండియన్ టీమ్ లో అడుగు పెడితే ఎలాంటి రికార్డులు పెడతాడోనని అభిమానులు అంచనాలు పెట్టేసుకుంటున్నారు. ఇతనికి పవన్ కళ్యాణ్ డిజాస్టర్ సినిమా పాటకు లింక్ ఏంటో చూద్దాం.
నితీష్ కుమార్ రెడ్డి మ్యాచుకు ముందు ప్రతిసారి వినే పాట జానీలో నారాజు కాకురా మా అన్నయ్యా. రమణ గోగుల స్వరకల్పనలో మంచి హుషారైన బీట్ తో సాగే సాంగ్ ఆ సినిమాలో ఇదొక్కటే. విన్న ప్రతిసారి తనకు కిక్ ఇస్తుందని, ఆ వైబ్రేషన్ ని ఫీలవుతూ గ్రౌండ్ లో అడుగు పెడితే సంతోషంగా ఉంటుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన వీడియో ఇప్పుడు వైరలవుతోంది. మత సామరస్యం గొప్పదనం గురించి చెబుతూ మాస్టర్జీ సమకూర్చిన సాహిత్యం ఇప్పటికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. రంగబలిలో నాగ శౌర్య కోరిమరీ ఈ పాటను వాడుకుని అచ్చం పవన్ లాగే స్టెప్స్ వేశాడు.
ఒక ఫ్లాప్ మూవీ నుంచి సైతం ఎలా ఇన్స్ పిరేషన్ వస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. జానీ ఫలితం ఎలా ఉన్నా దాన్ని కల్ట్ క్లాసిక్ గా భావించే అభిమానులకు కొదవలేదు. స్వీయ దర్శకత్వంలో పవన్ స్టంట్స్ కంపోజ్ చేసుకున్న ఈ ఎమోషనల్ యాక్షన్ మూవీలో డ్రామాని తగ్గించి కమర్షియల్ ఎలిమెంట్స్ పెంచి ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేదని ఫీలవుతూ ఉంటారు. గీతాంజలి తరహా బ్యాక్ డ్రాప్ కి మార్షల్ ఆర్ట్స్ కి మిక్స్ చేయబోయే ఆర్ట్ ఫిలిం మేకింగ్ చేసిన పవన్ డిజాస్టర్ చవి చూడాల్సి వచ్చింది. అయితేనేం తన మ్యూజిక్ టేస్ట్ ఇప్పటికీ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలవడం విశేషం.