ఆ సంస్థను నిలబెడుతున్న హీరో

సితార ఎంటర్టైన్మెంట్స్.. టాలీవుడ్లో మోస్ట్ హ్యాపెనింగ్స్ బేనర్లలో ఒకటి. హారిక హాసిని బేనర్ మీద తన బాబాయి రాధాకృష్ణతో కలిసి ఓ వైపు భారీ చిత్రాలను నిర్మిస్తూనే.. ఇంకోవైపు ఈ సంస్థలో మిడ్ రేంజ్ మూవీస్ తీస్తుంటాడు సూర్యదేవర నాగవంశీ. ఐతే ఈ రెండు సంస్థలకు కొంత కాలంగా పెద్దగా కలిసి రావడం లేదు. సక్సెస్ రేట్ బాగా పడిపోయింది.

హారిక హాసిని బేనర్లో ‘అల వైకుంఠపురములో’తో బ్లాక్‌బస్టర్ కొట్టిన తర్వాత.. ‘గుంటూరు కారం’ తీస్తే తేడా కొట్టింది. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అని టీం ప్రచారం చేసుకున్నప్పటికీ.. వాస్తవానికి ఈ సినిమాను కొన్న బయ్యర్లెవ్వరూ లాభాలు అందుకోలేదు.

ఇక సితార సంస్థ విషయానికి వస్తే.. ఈ సంస్థలో ప్రొడ్యూస్ చేసిన అత్యంత పెద్ద సినిమా ‘భీమ్లా నాయక్’ కొంత మేర నష్టాలే మిగిల్చింది. ఇక గత కొన్నేళ్లలో ఈ బేనర్లో హిందీ జెర్సీ, స్వాతిముత్యం, బుట్టబొమ్మ, ఆదికేశవ లాంటి ఫెయిల్యూర్ మూవీస్ వచ్చాయి.

సర్, మ్యాడ్ సినిమాలు సితారకు ఓ మోస్తరు లాభాలు అందించాయి. ఐతే ఈ సంస్థకు లాభాల పంట పండించింది మాత్రం సిద్ధు జొన్నలగడ్డనే. అతను హీరోగా సితార సంస్థలో తెరకెక్కిన తొలి చిత్రం ‘డీజే టిల్లు’ రెండేళ్ల కిందట సెన్సేషనల్ హిట్ అయింది. సిద్ధుకు స్టార్ ఇమేజ్ లేని టైంలో తక్కువ బడ్జెట్లో తీసిన ఈ సినిమా.. పెట్టుబడి మీద మూణ్నాలుగు రెట్ల లాభాలు అందించింది.

ఇక రెండేళ్ల తర్వాత ఇప్పుడొచ్చిన దీని సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ ఇంకా పెద్ద హిట్టయింది. ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్కును అందుకుంది. ఈ సినిమా రన్ ఇంకా చాలా రోజులు కొనసాగేలా ఉంది. దీని ప్రొడక్షన్ కాస్ట్ పది కోట్లే. సిద్ధుకు లాభాల్లో వాటా ఇవ్వాల్సి ఉంది. ఎలా చూసినా సినిమా మీద సితార సంస్థకు రూ.30 కోట్లు తక్కువ కాకుండా లాభం వస్తుందని అంచనా. సిద్ధు సినిమాలను పక్కన పెట్టి బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే సితార సంస్థ పుట్టి మునిగేదే. ఒక రకంగా ఆ సంస్థను నిలబెడుతున్నది సిద్ధు జొన్నలగడ్డ అనే చెప్పాలి.