పాతికేళ్ల తర్వాత ఓ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ తెరకెక్కడం అరుదైన విషయం. లోకనాయకుడు కమల్ హాసన్‌తో లెజెండరీ డైరెక్టర్ శంకర్ ఈ ప్రయత్నమే చేస్తున్నారు. వీరి కలయికలో వచ్చిన ఆల్ టైం బ్లాక్‌బస్టర్ మూవీ ఇండియన్ (తెలుగులో భారతీయుడు) మూవీకి నాలుగేళ్ల కిందట సీక్వెల్ మొదలవడం.. రకరకాల కారణాల వల్ల ఆ సినిమా పూర్తి కావడంలో విపరీతమైన జాప్యం జరగడం తెలిసిందే.
ఎట్టకేలకు సినిమా పూర్తయి విడుదలకు సిద్ధమైంది. రిలీజ్ గురించి తాజాగా ప్రకటన కూడా చేసింది చిత్ర బృందం. జూన్ నెలలో ఇండియన్-2 ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఈ రోజు ఒక పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఐతే రిలీజ్ విషయంలో ఊరించి ఊరించి కేవలం నెల వరకే ఖాయం చేసి డేట్ చెప్పకపోవడం పట్ల కమల్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
ఇండియన్-2 పాన్ ఇండియా స్థాయిలో రిలీజయ్యే మూవీ. అలాంటి సినిమాకు వివిధ భాషల్లో ఇతర సినిమాల డేట్లు అవీ సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటపుడు చాలా ముందుగానే డేట్ ఖరారు చేయాలి. జస్ట్ జూన్‌లో రిలీజ్ అంటే వేరే సినిమాల ప్లానింగ్ దెబ్బ తింటుంది. అందుకే డేట్ ప్రకటించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. బహుశా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి కావడానికి సమయం పడుతుండొచ్చు. ఫస్ట్ కాపీ రెడీ అయ్యాకే డేట్ ప్రకటించాలన్నది శంకర్ అండ్ కో ఉద్దేశం కావచ్చు.
లైకా ప్రొడక్షన్స్ దాదాపు మూడొందల కోట్ల బడ్జెట్లో తెరకెక్కిస్తున్న చిత్రమిది. కమల్ సరసన కాజల్ అగర్వాల్ నటించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగులో కూడా ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates