ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషయమై గత నెల ఆయన అభిమానులు ఎంతగా ఆందోళన చెందారో తెలిసిందే. ఒక దశలో ఆయన పరిస్థితి విషమించడంతో అందరూ తీవ్రంగా కలత చెందారు. అదృష్టవశాత్తూ ఆ స్థితి నుంచి ఆయన కోలుకున్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఈ మధ్యే కరోనా నెగెటివ్ వచ్చిందాయనకు. ఐతే ఆయన పూర్తిగా కోలుకోవడానికైతే ఇంకా సమయం పట్టేట్లే ఉంది. నాలుగు రోజుల విరామం తర్వాత బాలు తనయుడు ఎస్పీ చరణ్ బాలు అభిమానుల కోసం ఆయన ఆరోగ్య స్థితిపై వీడియో అప్ డేట్ కూడా ఇచ్చాడు.
బాలుకు వెంటిలేటర్ తీశారా లేదా అన్నది వెల్లడించలేదు కానీ.. బాలు చాలా వరకు కోలుకున్నారనే చెప్పాడు చరణ్. తాజాగా తీసిన స్కాన్లను బట్టి చూస్తే ఊపిరితిత్తులతో సహా మిగతా అవయవాలన్నీ చాలా వరకు మెరుగుపడ్డ విషయం వాటిలో స్పష్టంగా తెలుస్తోందని అన్నాడు. చికిత్సకు బాలు బాగా స్పందిస్తున్నారని.. ఫిజియో థెరపీకి సహకరిస్తున్నాడని చెప్పాడు. వైద్యులు ఆయన్ని కూర్చోబెట్టి 20-25 నిమిషాల పాటు థెరపీ చేస్తున్నారని చెప్పాడు. బాలు బాగా మాట్లాడుతున్నట్లు కూడా చరణ్ వెల్లడించాడు. ఇక నోటి ద్వారా బాలుకు ఆహారం అందించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని.. త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుంటారన్న ఆశాభావం కలుగుతోందని చరణ్ చెప్పాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates