ఒప్పుకున్న సినిమాలకే డేట్లు ఎలా ఇస్తాడోనని నిర్మాతలు సతమతమతమవుతూ ఉంటే పవన్ కళ్యాణ్ ఇంకో ప్రాజెక్టుకి ఎస్ చెప్పాడంటే నమ్మడం కష్టమే. ఏపీ ఎన్నికలు, జనసేన కార్యకలాపాల కోసం బ్రేక్ తీసుకున్న పవర్ స్టార్ జూన్ నుంచి మళ్ళీ సెట్స్ లో అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఓజికి కేవలం నలభై రోజులు ఇస్తే చాలు పూర్తి చేయడానికి దర్శకుడు సుజిత్ సిద్ధంగా ఉన్నాడు. ఇంకోవైపు రవితేజ మిస్టర్ బచ్చన్ ఫినిష్ చేసే పనిలో ఉన్న హరీష్ శంకర్ కనీసం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ కోసం మొత్తం రెడీ చేసి పెట్టుకుంటాడు.
ఈ రెండూ ఒక ఎత్తయితే హరిహర వీరమల్లు బాధ్యత ఇంకా పెద్దది. ఏళ్ళు గడిచిపోతున్నా ఇంకా పూర్తవ్వని ఈ ప్యాన్ ఇండియా మూవీ మీద నిర్మాత ఏఎం రత్నం బోలెడు డబ్బు, సమయం ఖర్చు పెట్టేశారు. 2025 విడుదల సాకారం చేయాలన్నా వీలైనంత త్వరగా బాలన్స్ షూటింగ్ మొదలు పెట్టాలి. ఇవి కాకుండా పవన్ దర్శకుడు సురేందర్ రెడ్డికి ఇచ్చిన కమిట్ మెంట్ లైన్ లో ఉంది. తాజాగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ప్లాన్ చేయబోయే ఒక యాక్షన్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేదు కానీ టాక్ అయితే బలంగా ఉంది.
పవన్ డెబ్యూ చేసింది గీత ఆర్ట్స్ లోనే. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో లాంచ్ బాధ్యతను అరవింద్ తీసుకున్నారు. తర్వాత జానీ డిజాస్టర్ అయ్యింది. జల్సా కమర్షియల్ గా విజయం సాధించి ఇప్పుడు కల్ట్ అనిపించుకుంటోంది కానీ ఆ టైంలో ఇండస్ట్రీ హిట్ అంచనాలు అందుకోని మాట వాస్తవం. తిరిగి ఈ కలయిక సాధ్యం కాలేదు. హీరోయిన్ గా అనుష్కని సంప్రదించినట్టు చెబుతున్నారు. చిరంజీవి, రామ్ చరణ్ తో గత కొన్నేళ్లుగా సినిమాలు తీయలేకపోయినా అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ మూవీని నిజంగా సెట్స్ పైకి తీసుకెళ్లగలిగితే ఫ్యాన్స్ కి శుభవార్తే. దర్శకుడెవరో ఫిక్స్ కాలేదు.