టాలీవుడ్ టాప్ డిమాండ్ లో ఉన్న హీరోయిన్ ఎవరయ్యా అంటే నిన్నటి దాకా ఉన్న పేరు శ్రీలీలనే. భగవంత్ కేసరి మినహాయించి గత ఏడాది మూడు డిజాస్టర్లు అందుకుంది. ఆదికేశవ, స్కంద, ఎక్స్ ట్రాడినరి మ్యాన్ మంచి అంచనాల మధ్య తీవ్రంగా నిరాశపరిచాయి. వసూళ్ల పరంగా గుంటూరు కారం చాలా బెటరే అయినప్పటికీ మనస్ఫూర్తిగా బ్లాక్ బస్టర్ అనలేని పరిస్థితి దానిది. ప్రస్తుతం ఎంబిబిఎస్ పరీక్షల కోసం గ్యాప్ తీసుకున్న శ్రీలీలకు ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్కటే పెండింగ్ ఉన్న కమిట్ మెంట్. నితిన్ రాబిన్ హుడ్ ఇంకా ఎస్ చెప్పలేదని టాక్. కొత్త కథలను వినడం లేదు.
ఇటు పక్క మీనాక్షి చౌదరి స్పీడ్ క్రమంగా పెరుగుతోంది. శ్రీలీల చేసిన గుంటూరు కారంలోనే మొక్కుబడి పాత్ర దక్కించుకుని ఫ్యాన్స్ కి నిటూర్పు మిగిల్చిన ఈ హిట్ భామ చెప్పుకోదగ్గ ఆఫర్లతో మంచి ప్లానింగ్ లో ఉంది. విజయ్ ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం గోట్ లో ఛాన్స్ దక్కించుకోవడం ద్వారా పెద్ద జాక్ పాట్ కొట్టింది. ఇది క్లిక్ అయితే తమిళ నిర్మాతలు వెంటపడతారు. మధ్యమధ్యలో బ్రేకులు పడుతున్నా సరే వరుణ్ తేజ్ మట్కా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ప్యాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ మీద ఫస్ట్ లుక్ పోస్టర్ చూశాక హైప్ పెరిగింది.
దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ లోనూ దర్శకుడు వెంకీ అట్లూరి మీనాక్షికి ఎక్కువ స్కోప్ ఉన్న క్యారెక్టర్ డిజైన్ చేశాడట. మొత్తం సెట్ల మీదున్న నాలుగు సినిమాల్లో మూడు స్ట్రెయిట్ తెలుగువే కావడం గమనించాల్సిన విషయం. మొన్నటిదాకా హిట్ ది సెకండ్ కేస్, విజయ్ ఆంటోనీ హత్య లాంటి వాటిలో తక్కువ ప్రాధాన్యం ఉన్న హీరోయిన్ గా చేసిన మీనాక్షి చౌదరి ఇప్పుడు మెయిన్ లీడ్ గా మారిపోవడం ప్రమోషనే. వీటిలో రెండు బ్లాక్ బస్టర్స్ అయినా చాలు డిమాండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. రష్మిక మందన్న కంటే ఈ సంవత్సరం ఎక్కువ రిలీజులు తనవే ఉండబోతున్నాయి.