ఇండస్ట్రీలో కెరీర్ పరంగా హీరోయిన్లకు ఎదురయ్యే అనుభవాలు విచిత్రంగా ఉంటాయి. కాస్త ఓపిక పట్టగలిగితే అద్భుతాలు జరుగుతాయి. సీనియర్ అయిపోయింది కాబట్టి ఎవరు ఆఫర్లిస్తారనుకుంటే త్రిష ఏకంగా సౌత్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటిగా నయనతారను దాటేయడం ఆల్రెడీ హాట్ టాపిక్ గా మారింది. ఎంట్రీ ఇచ్చిన కొత్తల్లో ఐరెన్ లెగ్ పేరు తెచ్చుకున్న పూజా హెగ్డేకు మూడేళ్లు దివ్యంగా గడిచింది. కట్ చేస్తే ఇప్పుడు గ్రాఫ్ మరీ కిందకు వెళ్ళిపోతోంది. సక్సెస్ మాత్రమే మాట్లాడే పరిశ్రమలో ఇలాంటివి సహజమే. ఇక ఆదిపురుష్ సీత విషయానికి వద్దాం.
కృతి సనన్ గత ఏడాది హ్యాట్రిక్ డిజాస్టర్లు పడ్డాయి. ఆదిపురుష్, షెహజాదా, గణపత్ ఒకదాన్ని మించి మరొకటి దారుణంగా బోల్తా కొట్టాయి. ప్రభాస్ ఇమేజ్ పుణ్యమాని మొదటిది భారీ వసూళ్లు తేవడంతో పాటు సీతగా కృతి బాగా నప్పిందనే పేరు ఇచ్చింది. అయితే ఈ సంవత్సరం తనకు బాగా కలిసి వస్తోంది. తక్కువ గ్యాప్ లో రిలీజైన రెండు సినిమాలు సూపర్ హిట్ కొట్టాయి. రివ్యూలు అదరహో అనకపోయినా తేరి బాతో మే ఐసా ఉల్జా జియా జనాలకు ఓ మోస్తరుగా నచ్చేసి విజయం సాధించింది. ముంబై లాంటి ప్రధాన కేంద్రాల్లో యాభై రోజులకు పరుగులు పెడుతోంది.
ఇటీవలే విడుదలైన క్రూ కూడా ఇదే బాట పట్టింది. క్రిటిక్స్ ముక్త కంఠంతో బాగుందని మెచ్చుకోకయినా కంటెంట్ లో ఉన్న కామెడీ, సస్పెన్స్ రెండూ బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అయ్యాయి. గత అయిదేళ్లలో ఏకంగా పది ఫ్లాపులతో కృతి సనన్ కెరీర్ బాగా డిఫెన్స్ లో పడిపోయింది. మిమికి జాతీయ అవార్డు రావడం మినహాయించి గర్వంగా ఫీలయ్యే క్షణాలు తక్కువగానే ఉన్నాయి. ఇలాంటి టైంలో 2024 ఫుల్లుగా కిక్ ఇస్తోంది. మహేష్ బాబు 1 నేనొక్కడినే, నాగ చైతన్య దోచేయ్ తో ఎప్పుడో టాలీవుడ్ లో అడుగు పెట్టిన కృతి సనన్ కు ఇక్కడ మాత్రం సక్సెస్ దక్కక దూరమైపోయింది.