తొమ్మిదేళ్ల నిరీక్షణకు బ్లాక్ బస్టర్ దక్కింది

టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన టిల్లు స్క్వేర్ ఈ సంవత్సరం హనుమాన్ తర్వాత ఆ స్థాయిలో వసూళ్లు నమోదు చేస్తున్న సినిమాగా నిలుస్తోంది. ఆశ్చర్యకరంగా ఇంత ఎండల్లోనూ వీక్ డేస్ ఆక్యుపెన్సీలు బాగుండటం పట్ల ట్రేడ్ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇంకా వారం తిరక్కుండానే నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన ప్రకారం డెబ్భై కోట్ల గ్రాస్ దాటడం చిన్న విషయం కాదు. రెండో వీకెండ్ కాగానే వంద కోట్ల లాంఛనాన్ని సులభంగా పూర్తి చేసుకుంటుంది. విజయంలో ఫోకస్ ఎక్కువగా సిద్దు జొన్నలగడ్డ మీదకు వెళ్తోంది కానీ దర్శకుడు మల్లిక్ రామ్ కష్టాన్ని విస్మరించికూడదు.

అవగాహన లేని వాళ్ళు ఇది అతని తొలి చిత్రంగా పొరపాటు పడుతున్నారు కానీ మల్లిక్ రామ్ తొమ్మిదేళ్లుగా ఇండస్ట్రీలోనే సక్సెస్ కోసం పోరాడుతున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. 2016లో సుమంత్ హీరోగా నరుడా డోనరుడా చేశాడు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ విక్కీ డోనర్ రీమేక్ గా రూపొందిన ఈ ఎంటర్ టైనర్ మన ఆడియన్స్ కి నచ్చలేదు. 2021లో తేజ సజ్జతో అద్భుతం చేశాడు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందిన ఈ మూవీ డైరెక్ట్ గా ఓటిటి రిలీజ్ దక్కించుకోవడంతో రీచ్ అంతగా రాలేదు. ఇతని లిస్టులో తరగతిగది దాటి, పెళ్లి గోల వెబ్ సిరీస్ లతో పాటు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే టిల్లు స్క్వేర్ ఇచ్చిన ప్రమోషన్ చాలా పెద్దది. డీజే టిల్లుని హ్యాండిల్ చేసిన దర్శకుడిని కాదని మల్లిక్ రామ్ కు ఛాన్స్ ఇవ్వడం పట్ల తొలుత పరిశ్రమ వర్గాల్లో ఏవేవో గుసగుసలు వినిపించాయి. ఎందుకంటే ఏ మాత్రం అటుఇటు అయినా చెడ్డ పేరు వచ్చేది అతనికే. స్క్రిప్ట్ లో తీసుకున్న శ్రద్ధ, సిద్దుతో కలిసి రైటర్స్ టీమ్ నుంచి బెస్ట్ రాబట్టుకున్న విధానం థియేటర్లలో విపరీతంగా నవ్వులు పూయించింది. ఫైనల్ గా ఎదురుచూపులకు బ్రేక్ వేసింది. దీని పుణ్యమాని మల్లిక్ రామ్ కు ఆఫర్లు క్యూ కడుతున్నాయట. టిల్లు క్యూబ్ మల్లిక్ రామే చేస్తాడా లేదానేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు.