38 ఏళ్ళ శ్రీదేవి సినిమాకు ఇప్పుడు సీక్వెల్

బాలీవుడ్ కే కాదు ఇతర భాషల్లోనూ సగటు ప్రేక్షకులకు సుపరిచితమైన బ్లాక్ బస్టర్ మిస్టర్ ఇండియా. 1987లో రిలీజైన ఈ సూపర్ ఫాంటసీ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ ని ఊపేసింది. శేఖర్ కపూర్ దర్శకత్వంలో బోనీ కపూర్ భారీ బడ్జెట్ తో నిర్మించగా కనక వర్షం కురిపించింది. చేతి వాచి కట్టుకుంటే అదృశ్యమయ్యే హీరో పాత్ర చుట్టూ అల్లిన డ్రామా, వాడిన గ్రాఫిక్స్ అబ్బురపరిచాయి. అనిల్ కపూర్, శ్రీదేవి జంట ఆడియన్స్ ని మైమరిపిస్తే, అమ్రిష్ పూరి విలనీ కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది. చిరంజీవి ఆల్ టైం క్లాసిక్ జగదేకవీరుడు అతిలోకసుందరికి స్ఫూర్తి ఇదేననడం నిజం.

నాలుగు దశాబ్దాలకు దగ్గర పడుతున్న వేళ మిస్టర్ ఇండియా సీక్వెల్ కి అడుగులు పడుతున్నాయి. నిజానికి 2011 లో ఈ ప్రయత్నం జరిగింది. అప్పటికి శ్రీదేవి బ్రతికే ఉంది. అదే జంటను రిపీట్ చేస్తూ సల్మాన్ ఖాన్ ని విలన్ గా పెట్టి ఏఆర్ రెహమాన్ సంగీతంతో మెగా బడ్జెట్ లో తీయాలని ప్లాన్ చేసుకున్నారు. ఆలోచనైతే పుట్టింది కానీ ప్రాజెక్టు ముందుకెళ్ళలేదు. ఇప్పుడు శ్రీదేవి, అమ్రిష్ పూరి, సతీష్ కౌశిక్ లాంటి కీలక తారాగణం లేరు. బోనీ ఆర్థికంగా బలంగా ఉన్నారు. ఒకవేళ అనిల్ కపూర్ ని తండ్రి పాత్రలో పెట్టి కొడుకుగా రన్బీర్ కపూర్ ని హీరోగా చేస్తే ప్యాన్ ఇండియా రేంజ్ లో రచ్చ చేయొచ్చు.

ఈసారి మాత్రం మిస్టర్ ఇండియా 2 ఉంటుందని బోనీ బల్లగుద్ది చెబుతున్నారు. తనతో పాటు జీ, వెస్ట్రన్ స్టూడియోస్ భాగస్వామ్యంలో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని చెబుతున్నారు. క్యాస్టింగ్ గురించి మాత్రం వివరాలు చెప్పడం లేదు. శ్రీదేవి బదులు జాన్వీ కపూర్ లేదా ఖుషి ఎవరో ఒకరు తల్లి ఐకానిక్ పాత్రను మళ్ళీ పోషిస్తే బాగుంటుందని అభిమానుల అభిప్రాయం. సరే మిస్టర్ ఇండియా సంగతి సరికాని టాలీవుడ్ లోనూ ఇంతే వయసున్న ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ కి సీక్వెల్స్ వస్తే బాగుంటుంది. కానీ ఆ దిశగా ఆలోచన చేయడం, బడ్జెట్ రిస్క్ కి సిద్ధపడటం అంత సులభం కాదు.