మెగాస్టార్ చిరంజీవి సినీ రంగంలోని వారికే కాదు.. వేరే రంగాల వారికి కూడా పెద్ద ఇన్‌స్పిరేషన్. ఒక మామూలు మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి మహా మహులైన నటులను ఢీకొట్టి నంబర్ వన్ స్థానాన్ని అధిరోహించడం అంటే మామూలు విషయం కాదు. ఆ స్థాయికి రావడానికి చిరు ఎంత కష్టపడ్డాడో తన జర్నీ చూస్తే అర్థమవుతుంది.
చిరు కష్టం గురించి తెలుసుకున్నపుడల్లా ఊరికే అయిపోరు మెగాస్టార్లు అనిపిస్తుంది. ఇప్పటికే ఎన్నో రకాలగు స్ఫూర్తి నింపిన చిరు.. తాజాగా తెలుగు మీడియా నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో విజయ్ దేవరకొండతో కలిసి జరిపిన సంభాషణలో స్ఫూర్తి నింపే అనేక విషయాలు చెప్పాడు. అందులో ఒక పాయింట్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ప్రతి వ్యక్తి నేర్చుకోదగ్గ ఒక పాఠం.. తమ జీవితాలకు అన్వయించుకోదగ్గ విషయం చిరు చెప్పారిందులో.
‘న్యాయం కావాలి’ షూటింగ్ జరుగుతున్నపుడు జరిగిన ఓ ఉదంతాన్ని చిరు ఇందులో గుర్తు చేసుకున్నారు. షూటింగ్ గ్యాప్‌లో తాను ఫ్లోర్ బయట ఉండగా.. షాట్ రెడీ అయినపుడు లోపలికి పిలిస్తే వెళ్లానని.. అప్పుడు నిర్మాత క్రాంతి కుమార్ తనను చూసి ఫ్రస్టేట్ అయ్యాడని.. ‘‘మీరేమైనా సూపర్ స్టార్లు అనుకుంటున్నారా.. ఇక్కడే ఉండొచ్చు కదా. మిమ్మల్ని మళ్లీ ఒకరు పిలవాలా’’ అని అరిచాడని చిరు గుర్తు చేసుకన్నాడు. అందరి ముందూ క్రాంతి కుమార్ అలా అరిచేసరికి చాలా బాధ పడ్డాడని.. ఇంటికి వెళ్లాక కూడా ఆ విషయం తనను వెంటాడిందని.. తర్వాత క్రాంతి కుమార్ ఫోన్ చేసి శారద ఎక్కువ టేక్స్ తీసుకుంటుండడంతో ఫ్రస్టేట్ అయి ఆ కోపాన్ని తనపై చూపించినట్లు వివరణ ఇచ్చాడని చిరు చెప్పాడు. ఐతే ఆయన తన మీద అరిచినా సరే.. ‘‘మీరేమైనా సూపర్ స్టార్లు అనుకుంటున్నారా’’ అనే మాట తన హృదయానికి బలంగా తాకిందని.. ఆ సమయానికి బాధ పడ్డా కూడా ఆ మాటను పట్టుకుని నిజంగానే మనం సూపర్ స్టార్ అవుదాం అనుకుని కష్టపడ్డాడని.. ఫలితమే తాను అందుకున్న స్థాయి అని చిరు చెప్పుకొచ్చాడు. ఎవరైనా తమను తిట్టినా, అవమానించేలా మాట్లాడినా అందులోంచి కూడా ఓ సానుకూల విషయాన్ని తీసుకుని ఎదుగుదలకు ఉపయోగించుకోవడం అన్నది ఇందులో చిరు నుంచి ఎవ్వరైనా నేర్చుకోదగ్గ గొప్ప పాఠం.