ఎన్నికల సమయంలో సినిమా వాళ్ల రాజకీయ ఆసక్తులు బయటపడుతుంటాయి. కొందరు ఎన్నికల్లో పోటీ చేస్తారు. కొందరు పార్టీల కోసం ప్రచారం చేసి పెడతారు. యాంకర్ టర్న్డ్ యాక్టర్ అనసూయ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జనసేన పార్టీ కోసం ప్రచారం చేయడానికి రెడీ అనడం చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.
అంత ఓపెన్‌గా అనసూయ ఆఫర్ ఇస్తున్న నేపథ్యంలో ఆమెతో జనసేనకు ప్రచారం చేయిస్తే బాగుంటుందన్న చర్చ జరిగింది. సోషల్ మీడియాలో జనసైనికులు చాలామంది ఆమె గురించి పాజిటివ్ కామెంట్లు చేశారు. కొందరైతే ఆమెను జనసైనికురాలిగా పేర్కొంటూ.. త్వరలో జనసేనలో చేరుతుందనే ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. ఐతే తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇస్తూ సోషల్ మీడియా జనాలకు ఒక సందేశం పంపింది అనసూయ.
తాను జనసేన పార్టీలో చేరతానని అనలేదని ఆమె స్పష్టం చేసింది. ‘‘నేను తుమ్మినా దగ్గినా కాంట్రవర్శీ చేస్తున్నారు. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో రాజకీయాల గురించి అడిగితే సమాధానం ఇచ్చానంతే. నాయకుడు నచ్చి, అజెండా నచ్చితే ప్రోత్సహిస్తానని మాత్రమే చెప్పా. అంతే కానీ పార్టీలో చేరతానని చెప్పలేదు. జనసేన పార్టీ అజెండా నాకెంతో నచ్చిన విషయం మాత్రం చెప్పా’’ అని అనసూయ వివరించింది.
ఈ రోజుల్లో లైమ్ లైట్లో ఉన్న సినిమా హీరోయిన్లు ఒక పార్టీలో చేరి పూర్తి స్థాయిలో రాజకీయం చేయడం అంటే కష్టమైన వ్యవహారమే. దాని వల్ల ఎదుర్కోవాల్సిన వ్యతిరేకత చాలా ఉంటుంది. అందుకే ఎన్నికల వరకు జస్ట్ ప్రచారం వరకు అయితే ఓకే కానీ.. జనసేన లేదా ఇంకో పార్టీలో చేరే ఉద్దేశం తనకు లేదని అనసూయ చెప్పకనే చెప్పింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates