యుఎస్‌లో తెలుగు సినిమాలకు ఉన్న మార్కెట్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని సందర్భాల్లో పెద్ద స్టార్లు నటించే బాలీవుడ్ సినిమాలను మించి తెలుగులో మిడ్ రేంజ్ సినిమాలకు ఎక్కువ వసూళ్లు వస్తుంటాయి. తెలుగు సినిమాలకు అక్కడ రేట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ప్రిమియర్స్ పెద్ద స్థాయిలో ప్లాన్ చేస్తుంటారు. హై రేట్స్ పెట్టి టికెట్లు అమ్ముతుంటారు. అయినా మనవాళ్లు ఎగబడి టికెట్లు కొంటారు.
అలా అని ప్రతి తెలుగు సినిమా అక్కడ బాగా ఆడేస్తుందని చెప్పలేం. కొన్ని పేరున్న చిత్రాలు కూడా మినిమం ఇంపాక్ట్ చూపించకుండా వాషౌట్ అయిపోతుంటాయి. ఇలాంటి టైంలో మలయాళ అనువాద చిత్రమైన ‘ప్రేమలు’ యుఎస్‌లో సాధించిన వసూళ్లు చూసి ట్రేడ్ పండిట్లు షాకవుతుంటారు. రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ రిలీజ్ చేసిన ‘ప్రేమలు’ తెలుగు వెర్షన్ యుఎస్‌లో ఏకంగా 3 లక్షల డాలర్లు వసూలు చేసి ఔరా అనిపించింది.
మామూలుగా చూస్తే మలయాళ అనువాద చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లోనే పెద్దగా వసూళ్లు రాబట్టవు. ఈ మధ్య కొంచెం వాటికి డిమాండ్ పెరిగినా కూడా వసూళ్లు నామమాాత్రంగానే ఉంటాయి. కానీ ‘ప్రేమలు’ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో అంచనాలను మించి ఆడేసింది. కోట్లల్లో వసూళ్లు రాబట్టింది. ఐతే తెలుగు రాష్ట్రాలను మించి యుఎస్‌లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. 3 లక్షల డాలర్లంటే చిన్న విషయం కాదు.
అసలు ఈ సినిమాను అక్కడ రిలీజ్ చేయడమే ఆశ్చర్యం అంటే ఇంతగా కలెక్షన్లు రాబట్టడం పెద్ద షాక్. ఇదొక డబ్బింగ్ మూవీ అనే ఫీల్ రాకుండా సగటు తెలుగు లవ్ స్టోరీలా అనిపించడం.. ‘నైంటీస్ మిడిల్‌క్లాస్’ ఫేమ్ ఆదిత్య హాసన్ ట్రెండీ డైలాగ్స్ రాయడం పెద్ద ప్లస్ అయ్యాయి. హీరో హీరోయిన్లకు కూడా మన ప్రేక్షకులు బాాగా కనెక్ట్ అయ్యారు. ఒక జాలీ రైడ్‌లా సినిమా ఉండటంతో దీంతో పాటుగా రిలీజైన ‘గామి’, ‘భీమా’లకు దీటుగా వసూళ్లు రాబట్టింది.