నిన్న విడుదలైన ఓం భీమ్ బుష్ కి టాక్ పాజిటివ్ గానే ఉన్నప్పటికీ ఓపెనింగ్స్ పరంగా అద్భుతాలేం జరగలేదు. చాలా ఏరియాల్లో ఆశించిన దాని కన్నా తక్కువ ఫిగర్లు నమోదు కాగా నైజామ్ అందులోనూ ప్రత్యేకంగా హైదరాబాద్ లో చెప్పుకోదగ్గ ఆక్యుపెన్సీలు కనిపించాయి. కంటెంట్ లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ టైం పాస్ కి ఢోకా లేదనే మాట బయటికి రావడంతో సాయంత్రానికి పికప్ ఉంటుందని బయ్యర్లు ఊహించారు. కానీ పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. ప్రధాన కారణాల్లో ఒకటిగా ఐపీఎల్ టోర్నమెంట్ నిన్న మొదలు కావడం గురించి చెప్పొచ్చు.
ఫస్ట్ మ్యాచ్ హైదరాబాద్ సన్ రైజర్స్ ది కాకపోయినా చెన్నై సూపర్ కింగ్స్ కి ఏపీ, తెలంగాణలోనూ భారీ ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ధోనికి ఇది లాస్ట్ సీజననే ప్రచారం జరగడంతో కోట్లాది అభిమానుల రూపంలో మద్దతు దక్కుతోంది. ఇంకో వైపు కోహ్లీ ఉన్న రాయల్ బెంగళూరు ఫాలోయర్స్ తక్కువేమీ లేరు. దీంతో సాయంత్రం మ్యాచ్ ప్రారంభం నుంచే జనాలు టీవీ సెట్ల ముందు కూర్చున్నారు. పైగా జియో సినిమా యాప్ ఉచితంగా స్ట్రీమింగ్ ఇవ్వడంతో పైసా ఖర్చు లేకుండా చూసేందుకు ఫిక్సయ్యారు. మొదలైన కాసేపటికే ఎనిమిది కోట్ల వ్యూస్ దాటిపోవడం దానికి నిదర్శనం.
ఇది ఓం భీమ్ బుష్ ఈవెనింగ్ షోల మీద తీవ్ర ప్రభావం చూపించిందనే కామెంట్ ని కొట్టిపారేయడానికి లేదు. ఇవాళ వీకెండ్ లో హైదరాబాద్ ఆట షురూ కాబోతోంది. వారాంతం కావడంతో చాలా కీలక మ్యాచులను మూడు రోజులకు బిసిసిఐ షెడ్యూల్ చేసింది. క్రికెట్ మీద ఆసక్తి లేని వాళ్ళు వేగంగా ఓం భీమ్ బుష్ వైపు టర్న్ కాకపోవడం కొంత ప్రభావం చూపిస్తోంది. సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ సరిగా హ్యాండిల్ చేయలేకపోవడం మౌత్ టాక్ ని ఎఫెక్ట్ చేస్తున్న మాట వాస్తవం. మొత్తానికి శ్రీవిష్ణు టీమ్ కి ఐపీఎల్ స్పీడ్ బ్రేక్ లా మారింది. ఈ వేడి అంత ఈజీగా చల్లారేది కాదు కానీ ఎదురుకోవడం సవాలే.