వాయిదాలు, రీ ప్లేస్ మెంట్లు కొత్త సినిమాలకే పాత వాటికీ జరుగుతోంది. ఇటీవలే గ్యాంగ్స్ అఫ్ గోదావరికి రిజర్వ్ చేసుకున్న మార్చి 8 తేదీని గామికి ఇవ్వడం చూశాం. రెండింటి హీరో విశ్వక్ సేన్ కావడం వల్ల ప్రత్యేక విశేషంగా నిలిచింది. మార్చి 27 రామ్ చరణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని ముందు నాయక్ రీ రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు ఫ్యాన్స్. అడ్వాన్స్ బుకింగ్స్ కొద్దిరోజుల క్రితం పెట్టేశారు. ఈలోగా అనూహ్య పరిణామాల మధ్య దాన్ని తప్పించి ఆ స్థానంలో మగధీరని మార్చి 26న భారీ ఎత్తున పునఃవిడుదల చేయబోతున్నారు. నిర్మాత గీతా ఆర్ట్స్ స్వయంగా పంపిణి చేయబోతోంది.
చరణ్ కెరీర్ లో రెండో సినిమాకే ఇండస్ట్రీ హిట్ సాధించిన మగధీరతో ఫ్యాన్స్ కు చాలా జ్ఞాపకాలున్నాయి. అప్పటిదాకా ఉన్న రికార్డులు తుడిచిపెట్టేలా రాజమౌళి చేయించిన కాల భైరవ వీర విహారానికి రికార్డులు దాసోహమన్నాయి. నాలుగు వందల ఏళ్ళ జ్ఞాపకాలకు పూర్వ జన్మ కాన్సెప్ట్ ని ముడిపెట్టడం క్లాసు మాస్ అందరిని ఉర్రూతలూగించింది. వంద మందిని చంపే ఎపిసోడ్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటారు. అలాంటి మగధీరని పదిహేను సంవత్సరాల తర్వాత తీసుకురావడం మంచి పనే కానీ రీ రిలీజ్ ట్రెండ్ తగ్గిపోయిన టైంలో రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
ఇది కాసేపు పక్కనపెడితే రామ్ చరణ్ బర్త్ డే బోలెడు కానుకలు సిద్ధం చేస్తున్నారు ఫ్యాన్స్. బుచ్చిబాబు ఆర్సి 16 టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు సుకుమార్ దర్శకత్వంలో మైత్రి తీయబోయే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన కూడా అదే రోజు ఉండొచ్చు. ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్న గేమ్ ఛేంజర్ మొదటి ఆడియో సింగల్ జరగండి జరగండి కూడా రిలీజ్ కానుంది. ఇవి కాకుండా ఇంకే సర్ప్రైజ్ లు ఉండే ఛాన్స్ లేనట్టే. ఇంకెలాంటి స్పెషల్ కంటెంట్ వచ్చే ఛాన్స్ లేదు. మరి మగధీర అప్పట్లా కొత్తగా ఏమైనా సంచలనం చేస్తుందో లేదో ఇంకో నాలుగు రోజులు ఆగితే తేలిపోతుంది.