ఇళయరాజా బయోపిక్.. రైటర్ కమల్?

దక్షిణాది లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా జీవిత కథ ఆధారంగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇళయరాజా పాత్రను తమిళ స్టార్ హీరో ధనుష్ చేస్తుండటంతో దీనిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. రెండు రోజుల కిందటే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.

ధనుష్‌తో కెప్టెన్ మిల్లర్ తీసిన అరుణ్ మాథేశ్వరన్ ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు. లోక నాయకుడు కమల్ హాసన్ సమక్షంలో ఈ సినిమా ప్రి లుక్ రిలీజ్ చేశారు. ఐతే కమల్ కారణం లేకుండా, కేవలం ఇళయరాజా మీద అభిమానంతో మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఆయన కూడా ఈ సినిమాలో భాగమవుతుండటం విశేషం. ఇళయరాజా బయోపిక్‌కు కమల్ స్క్రిప్టు రాస్తుండటం విశేషం. ఆయన ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నాడు.

కమల్‌కు రైటర్‌గా, డైరెక్టర్‌గా గొప్ప పేరుంది. ‘హే రామ్’ లాంటి క్లాసిక్ తీసిన దర్శకుడాయన. ‘దశావతారం’ సహా చిత్రాలకు స్క్రీన్ ప్లే సమకూర్చాడు. ఆయన రైటింగ్ చాలా డిఫరెంట్‌గా, క్యూరియాసిటీ పెంచేలా ఉంటుంది. మరి ఇళయరాజా బయోపిక్‌కు ఏరి కోరి స్క్రీన్ ప్లే రాస్తున్నాడంటే అందులో ఆయన ముద్ర కచ్చితంగా ఉంటుంది.

ఇళయరాజా అంటే కమల్‌కు అమితమైన ప్రేమ, గౌరవం ఉన్నాయి. కమల్ సినిమాలు ఎన్నింటికో ఆయన సంగీతం సమకూర్చారు. ఇళయరాజాతో కలిసి ఎన్నోసార్లు సంగీత చర్చల్లో పాల్గొన్నాడు కమల్. ఇద్దరి మధ్య గొప్ప అనుబంధం ఉంది. అలాంటి అనుబంధం ఉన్న వ్యక్తి మీద తీసే సినిమాకు కమల్ స్క్రీన్ ప్లే రాయడం ఆసక్తి రేకెత్తించే విషయం. ఇంకో పెద్ద విశేషం ఏంటంటే తన బయోపిక్‌కు తనే సంగీతం సమకూర్చబోతున్నాడు ఇళయరాజా.