విశ్వక్ సేన్ హీరోగా ఏళ్ళ తరబడి నిర్మాణంలో ఉండి ఆలస్యమైనా సరే మంచి విజయం సాధించిన గామి బాక్సాఫీస్ రన్ పూర్తి చేసుకోవడానికి దగ్గరలో ఉంది. మొదటివారంలోనే నెమ్మదించినప్పటికీ అప్పటికే బ్రేక్ ఈవెన్ దాటిపోయి బయ్యర్లకు మంచి లాభాలు ఇచ్చింది. ఈ ప్రాజెక్టు మొదలైన కొత్తలో క్రౌడ్ ఫండింగ్ ద్వారా బడ్జెట్ సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. అంటే సోషల్ మీడియా తదితర మాధ్యమాల ద్వారా కొత్త వాళ్ళతో వీలైనంత డబ్బును ప్రోగు చేసి దాని ద్వారా సినిమాకు ఖర్చు పెట్టడం. ఇది కొత్త ప్రాక్టీస్ కాకపోయినా సక్సెసైన సందర్భాలు తక్కువ.
గామికి అలా జరగలేదు. హిట్టు కొట్టింది. దీంతో నిర్మాణ బృందం తమకు మొదట్లో నమ్మకంతో సొమ్ము పంపిన వారికి ఇమెయిల్స్ ద్వారా వివరాలు సేకరించి దాన్ని వెనక్కు ఇచ్చే పనిలో ఉన్నట్టు లేటెస్ట్ అప్డేట్. కొందరికి మెయిల్స్ కూడా వచ్చినట్టు తెలిసింది. ఇది నిజమైతే మంచి పరిణామని చెప్పాలి. ఎందుకంటే ఎవరికైనా కాసింత డబ్బిస్తేనే వెనక్కు రాలేని పరిస్థితుల్లో ఇలా అడిగి మరీ రిటర్న్ ఇవ్వడం అరుదు. ఎవరు ఎంత మొత్తం ఇచ్చారనేది టీమ్ కు సంబంధించిన అంతర్గత వ్యవహారం కాబట్టి దాని గురించి వివరాలు బయటికి ఇవ్వకపోవచ్చు. ఏదైతేనేం ఇది మరొకరికి దారి చూపడమే.
భవిష్యత్తులో ఇలాంటి ప్రయత్నాలకు చేయూత దక్కడం చాలా అవసరం. ఎందరో దర్శకులు ఫండింగ్ లేని కారణంగా స్క్రిప్టులను, సగంలో ఆపేసిన సినిమాలను చూసుకుంటూ కాలం గడుపుతున్నారు. అలాంటి వాళ్ళకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా సహాయం అందితే మరింత క్రియేటివిటీకి దారి దొరుకుంది. యువి లాంటి అగ్ర సంస్థల మద్దతు వస్తుంది. రికార్డులు బద్దలు కొట్టకపోయినా గామి పనితనం విమర్శకులను మెప్పించింది. పరిమితుల వల్ల కొన్ని విషయాల్లో రాజీ పడ్డారు కానీ పూర్తి స్థాయి బడ్జెట్ దొరికి ఉంటే ఇది ఇంకా పెద్ద విజువల్ వండర్ అయ్యేదన్న విశ్వక్ మాటల్లో నిజం లేకపోలేదు.