థియేటర్ అనుభూతి OTT ఇవ్వడం అసాధ్యం

హనుమాన్ ఓటిటిలో వచ్చాక ఊహించని విధంగా సోషల్ మీడియాలో నెగటివిటీ కనిపిస్తోంది. ఇప్పటిదాకా చూడనివాళ్ళు టీవీలో ఫోన్ లో చూసి ఇవేం గ్రాఫిక్స్, దీనికా మూడు వందల కోట్లు వచ్చాయని ట్వీట్లు పెడుతున్నారు. గుంటూరు కారం టైంలో దీని వల్ల తమ హీరో రన్ బాగా దెబ్బ తిందని ఫీలైన కొందరు మహేష్ ఫ్యాన్స్ వీళ్ళతో జత కట్టడంతో ఒక్కొక్కరుగా నెగటివ్ ఒపీనియన్స్ పంచుకుంటున్నారు. దీని మీద పెద్ద ఎత్తున డిబేట్లు కూడా జరుగుతున్నాయి. థియేటర్ లో పెద్ద స్క్రీన్ మీద డాల్బీ సౌండ్ తో చూస్తున్నప్పుడు వచ్చే అనుభూతి ఇంటి ఓటిటి ఇవ్వడం అసాధ్యం.

ఇది బేసిక్ లాజిక్. ఎందుకంటే పెద్ద తెర ఎక్స్ పీరియన్స్ కు ఏదీ సాటిరాదు. వందలాది మన చుట్టూ ఉన్నా ఏకాంతంగా ఫీలయ్యే చీకటి ప్రపంచం లాంటి హాలులో తదేకంగా ఒక సినిమా చూడటం వేరు. రిమోట్ కంట్రోల్ చేతులో పట్టుకుని ఫార్వార్డ్ చేసుకుంటూ, ఇంట్లో పనులు చూసుకుంటూ, మధ్యలో పవర్ పోయినా నెట్ కట్ అయినా తిట్టుకుంటూ చూడటం వేరు. రెండింటికి పొంతన కుదరదు. అలాంటప్పుడు హనుమాన్ లాంటి విజువల్ గ్రాండియర్ ఒకే ఫీల్ ని రెండు చోట్ల ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు. అంతమాత్రాన సినిమా బాలేదని సర్టిఫికెట్ ఇవ్వడం ముమ్మాటికీ తప్పే.

ప్రేక్షకులు గుడ్డిగా సినిమా చూడలేదు కదా. అపోజిషన్లో స్టార్ హీరోల మరో నాలుగు సినిమాలు ఎక్కువ స్క్రీన్లలో రిలీజైనా సరే హనుమాన్ కి బ్రహ్మరధం పట్టరు. అంతెందుకు నిన్న 66వ రోజు హైదరాబాద్ కొన్ని మల్టీప్లెక్సుల్లో సింగల్ షోలు 80 శాతం దాకా ఆక్యుపెన్సీ నమోదు చేశాయి. కొత్త రిలీజులు మార్కెట్ లో పదిహేను దాకా ఉన్నప్పుడు రెండు నెలలు పాత సినిమా అయినా హనుమాన్ చూడటం ఎందుకు. ఇంత కన్నా వేరే ఉదాహరణ కావాలా. అయినా అవతార్, ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ లాంటివి కేవలం ఇంట్లోనే చూసే బాపతు కాదు. ఖచ్చితంగా ఒక్కసారైనా థియేటర్ కెళ్ళి చూడాల్సిన బొమ్మలు.