వైఎస్ వివేకా మీద బయోపిక్

https://www.youtube.com/watch?v=j5KI26ViQ40

గత ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హాట్ టాపిక్.. వైఎస్ రాజశేఖర్ తమ్ముడు, వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా హత్యే. ముందు ఆయనది సహజ మరణం అని.. గుండెపోటుతోనే ఆయన చనిపోయారని స్వయంగా సాక్షి మీడియాలో వార్తలు వచ్చాయి. వైకాపా నేతలు కూడా కొందరు అదే ప్రకటన చేశారు. తీరా చూస్తే ఆయనది దారుణ హత్య అనే విషయం వెల్లడైంది. అప్పుడు వివేకాను చంపించింది నారా చంద్రబాబు నాయుడే అని సాక్షి మీడియా, వైకాపా నేతలు ఎలా ప్రచారం చేశారో తెలిసిందే. ఐ

తే జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక ఈ విషయాన్ని రుజువు చేయలేకపోయింది. ఈ కేసులో సీబీఐ విచారణ సైతం వద్దని జగన్ చెప్పడం చర్చనీయాంశం అయింది. రోజులు గడిచేకొద్దీ వివేకా హత్యకు సంబంధించి వేళ్లన్నీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు జగన్ వైపు చూపించాయి. గత ఎన్నికల లాగే ఈసారి కూడా వివేకా హత్య కేసు చర్చనీయాంశం అవుతోంది.

ఇలాంటి తరుణంలో వివేకా మీద ఒక బయోపిక్ సైతం రెడీ అవడం విశేషం. దీని వెనుక ఎవరున్నారో ఏంటో కానీ.. ఈ రోజు రిలీజైన వివేకా బయోపిక్ ‘వివేకం’ ట్రైలర్ చూస్తే.. టార్గెట్ జగన్ అండ్ కోనే అని అర్థమవుతుంది. వైఎస్ మరణానంతరం జగన్ సొంతంగా పార్టీ పెట్టడం, కాంగ్రెస్‌‌లోనే ఉండాలని భావించిన వివేకాను కుటుంబం ద్వారా ఒత్తిడి చేయించి వైకాపాలో చేరేలా చూడడం.. ఆ తర్వాత ఆయన్ని ఓడించేందుకు తెర వెనుక కుయుక్తులు పన్నడం.. చివరికి ఆయన హత్యకు గురి కావడం.. ఆపై పరిణామాలు అన్నింటినీ ఈ సినిమలో చూపించారు.

ఈ మూవీలో ఎవరూ పేరున్న నటీనటులు నటించలేదు. అందరూ దాదాపుగా కొత్తవాళ్లే. నేరుగా జగన్, వివేకా, చంద్రబాబు.. ఇలా ఒరిజినల్ పేర్లనే వాడేశారు. మరి ఇలా పేర్లు పెట్టి సినిమాలు తీస్తే లీగల్ చిక్కులు తప్పకపోవచ్చు. సినిమా అయితే జగన్ అండ్ కోను టార్గెట్ చేసినట్లే కనిపిస్తోంది. మరి ఈ సినిమా ఏ అడ్డంకులూ లేకుండా విడుదల కాగలదా అన్నది చూడాలి.