మాస్ దరువేశారు కానీ పని చేయలేదు

ఒకప్పుడు పూరి జగన్నాథ్ తమ్ముడిగా ఇండస్ట్రీకి హీరో ఎంట్రీ ఇచ్చిన సాయి రామ్ శంకర్ ఒకటి రెండు హిట్లు కొట్టి చాలా త్వరగా గ్యాప్ తీసుకున్నాడు. అందరూ మర్చిపోయారనుకుంటున్న టైంలో వెయ్ దరువెయ్ తో రీ ఎంట్రీ ఇచ్చాడు. శుక్రవారం తొమ్మిది సినిమాల మధ్య పోటీ పడుతూ బరిలో దిగింది. ప్రమోషన్లు బాగానే చేసినప్పటికీ ఆడియన్స్ కి ఎక్కువ రీచ్ కాలేకపోవడంతో ఓపెనింగ్స్ తక్కువగా వచ్చాయి. తన సెకండ్ ఇన్నింగ్స్ కి బలమైన పునాది వేస్తుందని నమ్మిన సాయిరామ్ శంకర్ ఎలాంటి ఫలితం అందుకున్నాడో తెలియాలంటే కాస్త కథాకమామీషులోకి వెళ్ళాలి.

కామారెడ్డిలో బేవార్స్ గా తిరిగే శంకర్(సాయిరామ్ శంకర్) ఊళ్ళో మాటలు పడలేక ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తాడు. తన చదువుకి నగరంలో జాబ్ దొరకడం కష్టమని గుర్తించి స్నేహితుడి సలహా మీద ఫేక్ సర్టిఫికెట్ తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. దాన్ని కొన్న కంపెనీలోనే పని చేసే శృతి(యశ శివకుమార్) ని తొలిచూపులోనే ఇష్టపడి ప్రేమిస్తాడు. సంస్థ ఓనర్ తమ్ముడు భాను ప్రసాద్(సునీల్) కు అన్నతో ఆర్థిక తగాదాలు ఉంటాయి. ఇంతకీ శంకర్ అక్కడికి ఎందుకు వచ్చాడు, తెలియకుండా ఇరుక్కున్న మాఫియా గుట్టుని ఎలా బయట పెట్టాడు అనేదే అసలు స్టోరీ.

నిఖిల్ సీరియస్ గా ట్రై చేసిన అర్జున్ సురవరంలో పాయింట్ ని మాస్ గా తీయాలని ట్రై చేశాడు దర్శకుడు నవీన్ రెడ్డి. జీరో మార్కెట్ ఉన్న సాయిరామ్ శంకర్ మీద ఇంత మాస్, రొటీన్ కామెడీ ఎలా వర్కౌట్ అవుతుందనుకున్నాడో ఎంత బుర్ర చించుకున్నా అర్థం కాదు. సిల్లీ సన్నివేశాలు, నవ్వించే బిల్డప్పులు, ఎలివేషన్లు వస్తూనే ఉంటాయి. బహుశా హీరో దర్శకుడు ఇంకా బంపర్ ఆఫర్ నాటి యుగంలోనే ఉన్నట్టున్నారు. క్రియేటివిటీ ఉంటే తప్ప చిన్న సినిమాలకు ఆదరణ దక్కలేని ట్రెండ్ లో ఇలాంటి పాత దరువులు థియేటర్ లో వినిపిస్తామంటే ప్రేక్షకులు అంగీకరించే పరిస్థితి ఎక్కడిది.