వకీల్ సాబ్ అమ్మాయికి ‘తంత్ర’ భంగం

హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసినప్పటికీ అనన్య నాగళ్ళకు చెప్పుకోదగ్గ గుర్తింపు వచ్చింది పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో. సక్సెస్ కోసం బలంగా ప్రయత్నిస్తున్న ఈ తెలుగమ్మాయి తాజాగా నటించిన మూవీ తంత్ర నిన్న థియేటర్లలో విడుదలయ్యింది. ఇప్పటిదాకా మీరు చూడని హారర్ అంటూ పబ్లిసిటీని బాగానే హోరెత్తించారు. చిన్న పిల్లలు పొరపాటున కూడా రావొద్దంటూ పోస్టర్లలో హెచ్చరికలు కూడా పెట్టారు. అంచనాలు పెద్దగా లేకపోయినా టాక్ నమ్ముకుని బరిలో దిగిన ఈ చిన్న చిత్రంలో స్టార్ క్యాస్టింగ్ ఎవరూ లేరు. మరి ఏమైనా షాక్ ఇచ్చేలా తంత్రం పని చేసిందా చూద్దాం.

చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన రేఖ(అనన్య నాగళ్ళ) తండ్రి కఠినమైన పెంపకంలో అమాయకంగా ఉంటుంది. ఊళ్ళోనే ఉండే క్లాస్ మేట్ తేజ (ధనుష్ రఘుముద్రి)ని ప్రేమిస్తుంది. అయితే దెయ్యాలని చూస్తూ భయపడుతూ విచిత్రంగా ప్రవర్తించే రేఖ మీద ఎవరో చేతబడి చేస్తున్నారని గుర్తిస్తాడు తేజ. ఎలాగైనా సరే ఈ క్షుద్ర పూజలను కనిపెట్టాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు ఓ మాంత్రికుడు (టెంపర్ వంశీ)తో పాటు రాజేశ్వరి(సలోని) ప్రమేయం ఉందని తెలుస్తుంది. అక్కడి నుంచి రేఖ, తేజల జీవితంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి. వాటిదే అసలు కథ.

దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి తీసుకున్న పాయింట్ మరీ కొత్తదేమీ కాకపోయినా సరైన ట్రీట్ మెంట్ పడి ఉంటే ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేది. కానీ స్క్రీన్ ప్లే వల్ల అది జరగలేదు. ప్రేక్షకులను భయపెట్టడం కన్నా తాంత్రిక శాస్త్రం గురించి క్లాసులు ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నించడంతో థ్రిల్, హారర్ స్థానంలో ల్యాగ్ వచ్చేసింది. ఊహించినట్టే కథనం సాగడం మరో ప్రధాన మైనస్. ఆర్టిస్టులు తమ పరిధుల్లో బాగానే చేసినప్పటికీ తెరమీద పండాల్సిన డ్రామా తేలిపోవడంతో తంత్ర ఓపికకు పరీక్షగా మిగులుతుంది. టెక్నికల్ టీమ్ పనితనం కొంత మేర కాపాడినా బెస్ట్ ఎక్స్ పీరియన్స్ కాలేకపోయింది.