మధ్య వయసు బ్రహ్మచారి వినోదం

ఒకప్పుడు కామెడీకి బ్రాండ్ అంబాసడర్ గా ఉన్న అల్లరి నరేష్ మధ్యలో కొన్ని వరస ఫ్లాపుల వల్ల చిన్న బ్రేక్ తీసుకుని సీరియస్ పాత్రలకు షిఫ్ట్ అయిపోయాడు. మహర్షి పేరు తేవడం, నాంది హిట్టు కొట్టడం చూసి మళ్ళీ హాస్యం వైపు వస్తాడో రాడోనని ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. అయితే ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం ఫలితాలు చూశాక మనసు మార్చుకున్నాడు. నా సామిరంగలో మెయిన్ హీరో కాకపోయినా అల్లరోడు పండించిన వినోదం నాగార్జున సక్సెస్ కు హెల్పయ్యింది. ఇప్పుడు తండ్రి ఈవివి క్లాసిక్ మూవీ ఆ ఒక్కటి అడక్కు టైటిల్ తో ఈ మార్చిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

టీజర్ వీడియోలో కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు. మధ్య వయసు దాటినా ఏదో ఒక కారణం వల్ల సంబంధాలు కుదరక బ్రహ్మచారిగా ఉంటాడో యువకుడు (అల్లరి నరేష్). ఇంట్లో వాళ్ళు ఎన్ని పెళ్లి చూపులకు తీసుకెళ్లినా సేమ్ స్టోరీ. ఇదే సమస్యతో బాధ పడుతున్నఓ అందమైన అమ్మాయి(ఫరియా అబ్దుల్లా) పరిచయమవుతుంది. ప్రేమగా మారుతున్న తరుణంలో ఇతగాడు పెళ్లి చేసుకుందామని అడుగుతాడు. దీంతో ఆమె కాస్తా ఆ ఒక్కటి అడక్కు అనేస్తుంది. అసలు కోరి బంగారం లాంటి అబ్బాయి జీవితంలోకి వస్తానంటే ఎందుకు వద్దంటుందో సమాధానం తెలియాలంటే తెరమీద చూడాలి.

అల్లరి నరేష్ తిరిగి ఒరిజినల్ స్కూల్ కు వెళ్ళిపోయాడు. తనతో పాటు వెన్నెల కిషోర్, ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ జానీ లివర్ కూతురు జామీ లివర్ నవ్వులు పంచడంలో భాగం పంచుకున్నారు. చాలా రోజుల తర్వాత అల్లరోడి బ్రాండ్ కనిపిస్తోంది.వెంకటేష్ మల్లేశ్వరి తరహాలో అనిపిస్తున్నా దర్శకుడు మల్లి అంకం ట్రీట్ మెంట్ పూర్తి ఎంటర్ టైన్మెంట్ మీద దృష్టి పెట్టాడు గోపి సుందర్ సంగీతం సమకూర్చగా సూర్య ఛాయాగ్రహణం అందించారు. అభిమానులు కోరుకున్న స్టైల్ లోకి వచ్చేసిన అల్లరి నరేష్ ఏమి అడిగే అవసరం లేకుండా హిట్టు కొడతాడనే ఫ్యాన్స్ నమ్మకం.