టాలీవుడ్లో కోన వెంకట్ తరహాలో స్టార్ రైటర్ అనే పేరు తెచ్చుకోలేదు. మీడియాలో, సోషల్ మీడియాలో ఎప్పుడూ పెద్దగా హైలైట్ అయింది లేదు. హడావుడి చేసింది లేదు. కానీ ప్రసన్నకుమార్ బెజవాడ అనే రైటర్ సక్సెస్ రేట్ మాత్రం పెద్ద పెద్ద రైటర్ల కంటే ఎక్కువే. ఇప్పటిదాకా అతను స్క్రిప్టు అందించిన ప్రతి సినిమా విజయవంతం అయింది.
సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురూ ప్రేమ కోసమే, ధమాకా, నా సామి రంగ.. ఈ చిత్రాల వరుస చూస్తే ప్రసన్న కుమార్ టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అతడి కథలు రొటీన్‌గానే అనిపిస్తాయి. కానీ ఎంటర్టైన్మెంట్‌కు ఢోకా లేకుండా ఆ కథలను తీర్చిదిద్ది ప్రేక్షకుల మెప్పు పొందుతాడు. కెరీర్ ఆరంభం నుంచి అతను త్రినాథరావు నక్కినతో ప్రయాణం చేస్తున్నాడు. ఆయనకు ప్రసన్నను ఆస్థాన రచయితగా పేర్కొనవచ్చు.
ఐతే నక్కిన నుంచి ప్రసన్నకుమార్ విడిపోతున్నట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇక కేవలం రచయిత పాత్రకు పరిమితం కాకుండా దర్శకుడు కావాలని భావించిన ప్రసన్న కుమార్ ‘నా సామి రంగ’తోనే మెగా ఫోన్ పట్టాలనుకున్నాడు. ఒక దశ వరకు అతనే ఈ చిత్రానికి దర్శకుడు. కానీ తర్వాత ఏమైందో ఏమో.. విజయ్ బిన్నీ డైరెక్టర్ కుర్చీలో కూర్చున్నాడు. ప్రసన్న రైటర్ పాత్రకు పరిమితం అయ్యాడు. అయితేనేం ఇంకో సక్సెస్ ఖాతాలోకి వచ్చింది. ఇది కాకుంటే ఇంకో సినిమాతో ప్రసన్న దర్శకుడి అవతారం ఎత్తుతాడని అనుకున్నారు. కానీ ఇంకా అందుకు రంగం సిద్ధం కానట్లుంది. తిరిగి అతను తన పాత క్యాంపులోనే అడుగు పెట్టాడు.
త్రినాథరావు కొత్త చిత్రానికి ప్రసన్న కుమారే స్క్రిప్టు అందిస్తున్నాడు. అందులో సందీప్ కిషన్ హీరోగా నటించనున్నాడు. సందీప్‌తో ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రాన్ని నిర్మించిన అనిల్ సుంకర, రాజేష్ దండనే ఈ చిత్రాన్నీ ప్రొడ్యూస్ చేయబోతున్నారు.