స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా నిలదొక్కుకోవాలని చూసిన సాయిరాం శంకర్ కు మొదట్లో ఓ మాదిరి హిట్లు పడ్డాయి. అన్నయ్యే తీసిన 143 ఐ లవ్ యు ఓ మోస్తరుగా ఆడగా బంపర్ ఆఫర్ కమర్షియల్ గా సక్సెస్ అందుకుంది. అక్కడితో కుర్రాడి లైఫ్ సెటిలనే అందరూ అనుకున్నారు. కానీ జరిగింది వేరు. అల్ట్రా డిజాస్టర్లతో సాయిరాం తన కెరీర్ ని రిస్క్ లో పెట్టుకున్నాడు. ఏవీ కనీస స్థాయిలో ఆడకపోవడంతో నిర్మాతలు క్రమంగా దూరమయ్యారు. ఒకపక్క పూరినే డైరెక్టర్ గా మార్కెట్ తగ్గించుకున్న పరిస్థితుల్లో ఇతని పరిస్థితి మెరుగు పడే అవకాశం దొరకలేదు.
2017 నేనో రకం తర్వాత సాయిరాం శంకర్ మళ్ళీ కనిపించలేదు. ఇప్పుడు ఏడేళ్ల గ్యాప్ తర్వాత వెయ్ దరువెయ్ తో మార్చి 15 ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రమోషన్లు గట్రా బాగానే చేస్తున్నారు. సునీల్ విలన్ గా నటించగా ఈసారి కూడా మాస్ బ్యాక్ డ్రాప్ నే ఎంచుకున్నాడు. ఇది కాకుండా ఒక పథకం ప్రకారం (సినిమా పేరు) షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకుని ల్యాబ్ నుంచి బయటికి వచ్చేందుకు కష్టపడుతోంది. ఇవి సక్సెస్ అయితే బంపర్ ఆఫర్ 2 తెరకెక్కించాలనే ప్రతిపాదన ముందే అందుకున్నారు. సో ఇదంతా సాయిరాం శంకర్ కంబ్యాక్ కోసం చేస్తున్న ఒంటరి పోరాటమే.
నిజానికి పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ విషయంలోనూ లిఫ్ట్ చేయలేక వదిలేయడం చూస్తున్నాం. అతనేదో సినిమాలు చేసుకుంటున్నాడు కానీ విజయం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. ప్రస్తుతం యాడ్స్ చేస్తున్నాడు తప్పించి కొత్త ప్రాజెక్టు ఇంకా ప్రకటించలేదు. వెయ్ దరువెయ్ మీద సాయిరాం శంకర్ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. లైగర్ డిజాస్టర్, డబుల్ ఇస్మార్ట్ లో జరుగుతున్న ఆలస్యం వల్ల పూరి ఇవేవి పట్టించుకునే స్టేజిలో లేడు. పోటీ ఏమి లేకపోయినా సాయిరాం శంకర్ ఓపెనింగ్స్ తెచ్చుకోవడం సవాలే. టాక్ చాలా బాగుంటే తప్ప జనాలు రారు.