సినిమాలకు నయా బ్రాండ్ ‘A’ సర్టిఫికెట్

మాములుగా ఏదైనా సినిమాకు ఏ సర్టిఫికెట్(పెద్దలకు మాత్రమే) ఇస్తే నిర్మాతలు, హీరోలు, దర్శకులు తెగ ఇబ్బంది పడేవారు. ఎక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ దూరమవుతారోనని. లేదా తమ కంటెంట్ గురించి పబ్లిక్ లో నెగటివ్ అభిప్రాయాలు వస్తాయేమోనని. కానీ అదంతా గతం. ఇప్పుడా ట్యాగే ఒక బ్రాండింగ్ మెటీరియల్ గా మారుతోంది. విడుదల కాబోతున్న గామి, భీమా రెండూ ఇదే క్యాటగిరీలో పడ్డాయి. మల్టీప్లెక్సుల్లో పిల్లలు రాకుండా కొంత మేర నియంత్రిస్తారేమో కానీ సింగల్ స్క్రీన్లలో అసలు ప్రేక్షకులను వయసుని సీరియస్ గా గమనించరు. టికెట్లుంటే లోపలికి పంపేయడమే.

ఈ ట్రెండ్ గత కొంత కాలంగా ఊపందుకుంది. యానిమల్, సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్, బేబీ, మ్యాడ్ లాంటి బ్లాక్ బస్టర్లన్నీ సెన్సార్ అధికారుల వల్ల పెద్దలకు మాత్రమే నిబంధనతో థియేటర్లలో అడుగు పెట్టాయి. అయినా వసూళ్ల వర్షం రాకుండా ఎవరూ ఆపలేకపోయారు. అర్జున్ రెడ్డి వచ్చిన కొత్తలో A ఉంది కదా యూత్ మాత్రమే చూస్తారనుకుంటే ఫ్యామిలీ జనాలు క్యూ కట్టడం అంత సులభంగా మర్చిపోలేం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా 1991లో రిలీజైన గ్యాంగ్ లీడర్ కు సైతం ఏ వచ్చిందంటే ఆశ్చర్యం కలగక మానదు. కానీ ఇది పేపర్ ప్రకటనల సాక్షిగా నిజం.

రాబోయే రోజుల్లో పబ్లిక్ దీన్ని ఏమంత సీరియస్ గా తీసుకోకపోయే అవకాశం లేకపోలేదు. హింస, కాస్త బోల్డ్ సీన్లు, యూత్ ని టార్గెట్ చేసుకున్న లిప్ లాకులు చాలా మాములు విషయాలుగా మారిపోయాయి. ఎప్పుడైతే వెబ్ సిరీస్ లలో మేకర్స్ హద్దులు దాటడం మొదలైందో అప్పటి నుంచే సినిమాల్లో చూపించేవి తక్కువ స్థాయిలో అనిపిస్తున్నాయి. కాకపోతే సెన్సార్ నిబంధనల ప్రకారం అక్కడి ఆఫీసర్లు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి స్టార్ హీరోలైనా సరే A తప్పడం లేదు. ఇకపై ప్రీ రిలీజ్ ఈవెంట్లో గర్వంగా సర్టిఫికెట్ ని ప్రదర్శించే రోజులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.