ప్రభాస్ దీపికా పాత్రలకు థ్రిల్లింగ్ ట్విస్టులు

విడుదల తేదీ కేవలం ఇంకో రెండు నెలల్లోనే ఉన్నా కల్కి 2898 ఏడి టీమ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డేట్ మిస్ చేయకూడదనే ఉద్దేశంతో పనులను వేగవంతం చేసింది. హైదరాబాద్, వైజాగ్ లాంటి ముఖ్య నగరాల్లోని థియేటర్లకు పబ్లిసిటీ మెటీరియల్ ని పంపించేసింది. మే 9 డేట్ స్పష్టంగా ఉన్న స్టాండీలు పలు చోట్ల దర్శనమిస్తున్నాయి. సో వాయిదా పడుతుందేమోననే ప్రచారాలను ఎంత మాత్రం నమ్మాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ప్రభాస్, దిశా పటానిల మీద ఒక రొమాంటిక్ సాంగ్ షూట్ చేసిన నాగ అశ్విన్ పోస్ట్ ప్రొడక్షన్ ని స్పీడప్ చేయబోతున్నాడు. ఇక అసలు పాయింటుకొద్దాం.

కల్కిలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ప్రభాస్, దీపికా పదుకునే పాత్రలకు చాలా ట్విస్టులు పెట్టాడట నాగ అశ్విన్. శ్రీ మహావిష్ణువు చివరి అవతారమైన కల్కిగా ప్రభాస్ కనిపిస్తాడు. సకల సృష్టికి సౌభాగ్యం సమకూర్చే లక్ష్మి దేవి పునర్జన్మ పొందితే ఎలా ఉంటుందనే ఆలోచనతో పుట్టిందే దీపికా పోషించిన పద్మ క్యారెక్టర్ గా లీకైన సోర్స్ నుంచి వినిపిస్తున్న కథనం. ఈ ఇద్దరు భార్యాభర్తలుగా కనిపిస్తారని ఇన్ సైడ్ టాక్. కమర్షియల్ సాంగ్స్ లాంటివి లేకుండా ఎమోషనల్ గా మహానటి టైపు లో ఫీల్ గుడ్ పాటలు ఈ జంట మీద ఉంటాయని తెలిసింది. సో కల్కి, పద్మలుగా ఈ ఇద్దరూ సందడి చేయబోతున్నారు.

కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని, అనుపమ్ ఖేర్ తదితరులు కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తారని తెలిసింది. అయితే ఇది మొదటి భాగమనే ప్రచారం ఎంత జరుగుతున్నా సీక్వెల్ ఉంటుందో లేదో వైజయంతి బృందం చెప్పడం లేదు. పార్ట్ 2లోనే కమల్ ఎక్కువ ఉంటారనే న్యూస్ గతంలోనే వచ్చినా దాన్ని ఖండించడం కానీ సమర్ధించడం కానీ చేయలేదు. ఇదంతా ఎలా ఉన్నా ప్రభాస్, దీపికాల జోడి మాత్రం ఫ్రెష్ గా అనిపించడం ఖాయం. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్న ఈ విజువల్ గ్రాండియర్ ని వేలాది థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది.