సీనియర్ నటి జయసుధ భర్త నితిన్ కపూర్ కొన్నేళ్ల కిందట ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం రేపింది. జయసుధతో ఆయనది అన్యోన్య వివాహ బంధమే. వీళ్లిద్దరికీ ఇద్దరు కొడుకులున్నారు. జయసుధ సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ తనవంతు పాత్ర పోషించారు. నితిన్ జయసుధతో సినిమాలు తీయడమే కాక కొన్ని వ్యాపారాలు చేస్తుండేవాడు. ఆయనకు ఆర్థిక సమస్యలు ఉన్నట్లు కూడా ఏమీ వార్తలు రాలేదు. మరి నితిన్ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చిందో అప్పుడు అర్థం కాలేదు. కొందరు ఈ విషయంలో జయసుధ మీద నిందలు వేశారు. భర్త చనిపోయినపుడు బాధలో ఉన్న జయసుధ దాని గురించి పెద్దగా మాట్లాడలేదు. ఐతే ఇప్పుడు నితిన్ ఆత్మహత్య గురించి ఆమె స్పందించింది.
సినిమా వాళ్ల గురించి అందరూ ఏది పడితే అది రాసేస్తుంటారు. నిజా నిజాలు తెలుసుకోరు. మా ఆయనకు అప్పులున్నట్లు కొందరు అప్పట్లో రాశారు. కానీ ఆయనకు ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు. నితిన్ సోదరుడు, మా కుటుంబంలో ఇంకో ఇద్దరు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏదో ఒకరోజు నితిన్ కూడా ఈ పని చేస్తాడని మాకు భయం ఉండేది. నేను, మా అత్తగారు అది జరగకుండా ఆపాలని ఎంతో ప్రయత్నించాం. కానీ మా వల్ల కాలేదు. మా ఫ్యామిలీలో ఇంకెవరికీ ఇలా జరగకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నాం.
నితిన్ మరణానంతరం ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. కుటుంబ అండతోనే దాన్నుంచి బయటపడ్డా అని జయసుధ చెప్పింది. జయసుధ చిన్నకొడుకు నిహార్ కపూర్.. రికార్డ్ బ్రేక్ అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates