మొన్న శుక్రవారం విడుదలైన సినిమాల్లో ఆపరేషన్ వాలెంటైన్ తో సహా ఏదీ పెద్దగా సౌండ్ చేయలేదు కానీ ఉన్నంతలో యూత్, చిన్న పిల్లలు డ్యూన్ 2 మీద ఆసక్తి చూపించారు. 2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీకి కొనసాగింపు కావడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. వాస్తవానికి ఫస్ట్ పార్ట్ కొంచెం స్లోగా, అందరికీ కనెక్ట్ అయ్యేంత యునివర్సల్ కంటెంట్ తో ఉండదు. అయినా సరే స్టోరీ టెల్లింగ్ విధానం దానికి ఫ్యాన్స్ ని తెచ్చి పెట్టింది. సీక్వెల్ లో అలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో దీనికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. మరి ఖలేజాకి కనెక్షన్ ఏంటో చూద్దాం.
ఇది అర్థం కావాలంటే కథేంటో తెలుసుకోవాలి. తండ్రి చనిపోయాక తల్లి జెస్సికాతో కలిసి ఆరాకీస్ గ్రహంలో నివసించే ఫ్రెమెన్ తెగ ప్రజల దగ్గరికి చేరుకుంటాడు పాల్ అట్రిడియస్ (తిమోతి షాలమే). తమను రక్షించే దేవుడి కోసం ఎదురు చూస్తున్న ఫ్రెమెన్ జనాలను ఆ రక్షకుడు తన కొడుకేనని నమ్మిస్తుంది జెస్సికా. కానీ పాల్ కు అలాంటి ఉద్దేశం ఉండదు. ఆరాకీస్ లో మాత్రమే దొరికే ఒక అరుదైన డ్రగ్ కోసం శత్రు తెగ ప్రయత్నిస్తూ ఉంటుంది. పాల్ తండ్రి చావుకు గతంలో వాళ్లే కారణం. తనను నమ్మిన తెగ సంరక్షణ, తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడమే అసలు పాయింట్.
ఖలేజాలో మహేష్ బాబుకి తెలియకుండానే మారుమూల గ్రామ ప్రజలకు దేవుడిగా కొలవబడతాడు. ముందు ఇష్టం లేకపోయినా వాళ్లకు జరుగుతున్న అన్యాయం చూశాక మనసు మార్చుకుని అండగా నిలబడి దుర్మార్గుల అంతం చూస్తాడు. త్రివిక్రమ్ రాసిన స్టోరీలోనూ అరుదైన సంపదకు సంబంధించిన లింక్ ఉంటుంది. మక్కికి మక్కి కాదు కానీ డ్యూన్ 2లో మెయిన్ ప్లాట్ ఖలేజాకు దగ్గరగా కలవడం గమనించవచ్చు. వీటి సంగతేమో కానీ కట్టిపడేసే విజువల్స్, అబ్బురపరిచే యాక్షన్ ఎపిసోడ్స్, ఎలివేషన్లతో డ్యూన్ 2 మాత్రం మూవీ లవర్స్ ని తెగ ఆకట్టుకుంటోంది. వసూళ్లు దాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.